Share News

AP Digital Corporation: డిజిటల్‌ అక్రమాలపై సీఐడీ

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:21 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ప్రకారం, రూ.171.9 కోట్ల ఖర్చులో రూ.37.20 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలింది.

AP Digital Corporation: డిజిటల్‌ అక్రమాలపై సీఐడీ

విజిలెన్స్‌ సిఫారసు మేరకు విచారణ

జగన్‌ హయాంలో భారీ అవకతవకలు

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచి ‘యాత్ర’ నటుడు మమ్ముట్టికి

రూ.50లక్షలు.. ఐపాక్‌, ఐడ్రీమ్స్‌ ఉద్యోగులకూ జీతాల చెల్లింపు

జగన్‌ రోత పత్రికకూ దోచిపెట్టారు.. 37 కోట్లు రికవరీ చేయాలి

అన్నిటికీ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బాధ్యుడు.. ప్రభుత్వానికి నివేదిక

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో డిజిటల్‌ కార్పొరేషన్‌ పేరుతో చేసిన అక్రమాలు, అవినీతిపై కూటమి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. జగన్‌ హయాంలో డిజిటల్‌ కార్పొరేషన్‌లో రూ.171.9 కోట్లు ఖర్చు చేయగా, అందులో 37.20 కోట్లు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. జగన్‌ పత్రిక సాక్షికి దోచిపెట్టడంతో పాటు ఆయన తండ్రి వైఎస్‌ పాదయాత్రపై వైసీపీ నాయకుడు నిర్మించిన యాత్ర-2 సినిమాలో నటించిన మలయాళీ నటుడు మమ్ముట్టికి రూ.50 లక్షలను ఈ కార్పొరేషన్‌ నుంచే చెల్లించినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి సీబీఐతో సంకెళ్లు వేయించుకున్న నిందితుడు అశోక్‌ రెడ్డి భార్య సుమ తియ్యగుర తదితరులకు కూడా చెల్లింపులు జరిపినట్లు తేల్చింది. ఇలాంటి పలు అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ చేసిన సిఫారసుకు అనుగుణంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు ఈ కార్పొరేషన్‌లో జరిగిన లావాదేవీల్లో 171.9 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, అందులో 139 కోట్లు ఇప్పటికే చెల్లింపులు అయ్యాయని ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన 76 పేజీల నివేదికలో విజిలెన్స్‌ వివరించింది.


నాడు ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఎండీగా వ్యవహరించిన చిన్న వాసుదేవరెడ్డి వీడియో కంటెంట్‌ పేరుతో భారీగా డబ్బులు దుర్వినియోగం చేశారని, మోసపూరితంగా వ్యవహరించి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని విజిలెన్స్‌ స్పష్టం చేసింది. కార్పొరేషన్‌లో అన్ని అక్రమాలకు వాసుదేవరెడ్డి బాధ్యుడని పేర్కొంది. ఐ డ్రీమ్స్‌ వ్యవస్థాపకుడైన వాసుదేవ రెడ్డి ఐపాక్‌, ఐడ్రీమ్స్‌ ఉద్యోగులను డిజిటల్‌ కార్పొరేషన్‌లో సిబ్బందిగా చూపించి జీతభత్యాలు చెల్లించినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. అనుభవం, అర్హతలు లేని వారిని ఉద్యోగాల్లో నియమించుకుని 37.20 కోట్లు చెల్లింపులు చేశారని వివరించింది. కాగితాల్లో తప్ప ఎక్కడా లేని సంస్థలైన డేటా మోటిఫ్‌, జీపీఆర్‌ పబ్లికేషన్స్‌, డెక్కన్‌ మీడియా, సాయునందినీ క్రియేషన్స్‌, త్రీ ఆటమ్‌ లీవ్స్‌, అవిసా మీడియా, సాయి అడ్వర్టైజింగ్‌, షాలోక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆర్‌ఆర్‌ మీడియా సంస్థలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించింది.

వీరిపై చర్యలు తీసుకోండి

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాల నియామకాలకు సెలెక్షన్‌ కమిటీ ఉంటుంది. కానీ అర్హతలేని 60 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నా చోద్యం చూసిన ఐ అండ్‌ పీఆర్‌ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ సభ్యుడు మధుసూదన్‌ రెడ్డి ఐఆర్‌ఎస్‌, కె. హేమచంద్రారెడ్డి, సి.ప్రతాప్‌, ఐ అండ్‌ పీఆర్‌ సీఈవో మధుసూదన్‌, చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ బ్రహ్మానంద పాత్రొ, ఏపీ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగి మోతీలాల్‌ నాయక్‌, బి. నాగేశ్వర రావు, రాధాకృష్ణ, రామసుబ్బయ్య, జీవీ రామకృష్ణా రావు, ఏవీ సుబ్బారెడ్డి, భూమిరెడ్డి శ్రీవర్ధన్‌ రెడ్డి, పాలేశ్వర రావు, గంగవరపు సుధీర్‌ కుమార్‌, పొన్నగంటి దీపిక, పొన్నగంటి శశికృష్ణ, తాడుక అరవింద్‌, మౌనిక, నాగభూషణ్‌ రెడ్డితో పాటు త్రీ అటామ్‌ లీవ్స్‌ సంస్థలపై న్యాయపరమైన చర్యలకు విజిలెన్స్‌ సిఫారసు చేసింది. సీఐడీ అధికారులు వీరిని పిలిచి విచారించబోతున్నారు.


జీఎస్టీ ఎగవేతపైనా చర్య తీసుకోవాలి

డిజిటల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలన్నింటికీ ఐ డ్రీమ్స్‌ వ్యవస్థాపకుడు వాసుదేవరెడ్డి బాధ్యుడని గుర్తించిన విజిలెన్స్‌... ఈ అక్రమ లావాదేవీల్లో జీఎస్టీ సైతం ఎగ్గొట్టినట్లు తేల్చింది. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచి భారీగా డబ్బులు తీసుకున్న డెక్కన్‌ మీడియా, త్రీ ఆటమ్‌ లీవ్స్‌ స్టోరీ టెల్లింగ్‌ సంస్థలు జీఎస్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంపై ఏసీబీ లేదా సీఐడీతో దర్యాప్తు చేయించాలని ఈ ఏడాది జనవరి 22న ప్రభుత్వానికి నివేదించింది. పరిశీలించిన ప్రభుత్వం ఫిబ్రవరి 25న కేసును సీఐడీకి అప్పగించింది.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 04:21 AM