Minority Welfare: మైనార్టీలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:03 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ స్వయం ఉపాధి రాయితీ బ్యాంకు రుణాల మంజూరికి ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 342.52 కోట్లు ఖర్చు చేయాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం
స్వయం ఉపాధికి రాయితీతో బ్యాంకు రుణాలు
అర్హులైన వారి కోసం 342.52 కోట్లు
శిక్షణ కోసం అదనంగా మరో 24 కోట్లు
మైనార్టీలను చిన్నచూపు చూసిన గత ప్రభుత్వం
మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్
ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ ప్రారంభం
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(ఓబీఎంఎంఎస్) వెబ్‌సైట్‌ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 169.50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. దీనికి సమానంగా రూ. 173.02 కోట్లు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, మొత్తం రూ. 342.52 కోట్లు అర్హులైన మైనార్టీల స్వయం ఉపాధికి ఖర్చు చేస్తామని తెలిపారు. శిక్షణ, ఉపాధి కోసం అదనంగా మరో రూ. 24 కోట్లు మంజూరు చేశామన్నారు. అర్హులైన వారంతా ఈ ఉపాధి రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలినుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు వేలాది మసీదులు, దర్గాలు, ఖబరస్థాన్లు, చర్చిలు తదితర నిర్మాణాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం మంజూరు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. మైనార్టీలను చిన్నచూపు చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టామన్నారు. ఇమామ్‌లు, మౌజన్లు, పాస్టర్లకు పెండింగ్‌లో ఉన్న గౌరవవేతనం ఇచ్చి మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని చెప్పారు.
అందుబాటులోకి ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్: ముస్తాక్ అహ్మద్
ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాలానా ముస్తాక్ అహ్మద్ సూచించారు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికీ రుణం మంజూరు చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 20,933 మందికి స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నామని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్ర్కీనింగ్, సెలక్షన్ కమిటీల ఎంపిక తర్వాత లబ్ధిదారుడికి రెండు బ్యాంకు ఖాతాలు తెరుస్తారని చెప్పారు. జిల్లాల కలెక్టర్ల అనుమతి తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీలు రుణాలు విడుదల చేస్తారని చెప్పారు. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాక వాటికి జియో ట్యాగింగ్ చేస్తామన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..