ఫౌండేషన్ పాఠశాలలు వద్దు: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:16 AM
ఫౌండేషన్ స్కూల్స్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. గ్రామీణ పాఠశాలలను మూసివేసే కుట్రగా ఇది మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది,
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఒకటి, రెండు తరగతులతో ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించింది. గత వైసీపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని విధ్వంసం చేయగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా గంటకొక విధానం చొప్పున నిర్ణయాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తోందని మండిపడింది. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం 8 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం అశాస్త్రీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తిలు శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. అన్ని ప్రాథమిక పాఠశాల్లోనూ ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఒకే విధంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలన్నింటిలోనూ అవసరమైనంతమంది సెకండరీగ్రేడ్ టీచర్స్‌ను నియమించాలని కోరారు.