Share News

శరవేగంగా ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:15 AM

అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం బహిరంగ సభా ప్రాంగణం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదికల పరిశీలనకు కేంద్ర భద్రతాబలగాలు రానున్నాయి. ప్రధాన మంత్రి కూర్చునే వేదిక స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తోంది. ప్రధాన వేదిక ప్రాంతంలో మెటల్‌ డిటెక్టర్లతో జల్లెడ పట్టనున్నాయి.

శరవేగంగా ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు

- అమరావతిలో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు

- సభా వేదిక పరిశీలనకు రానున్న కేంద్ర భద్రతా బలగాలు

- ప్రధాన వేదిక స్థల పరిశీలన.. మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ తర్వాతే క్లియరెన్స్‌

- ప్రస్తుతం ముమ్మరంగా గ్యాలరీల టెంట్ల ఏర్పాటు

- మీడియం గ్యాలరీ పనులు కొలక్కి.. రూఫ్‌ వేయటమే తరువాయి!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం బహిరంగ సభా ప్రాంగణం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదికల పరిశీలనకు కేంద్ర భద్రతాబలగాలు రానున్నాయి. ప్రధాన మంత్రి కూర్చునే వేదిక స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తోంది. ప్రధాన వేదిక ప్రాంతంలో మెటల్‌ డిటెక్టర్లతో జల్లెడ పట్టనున్నాయి. భద్రతా బలగాల క్లియరెన్స్‌ తర్వాత ఆ ప్రాంతంలో వేదిక పనులు కొనసాగుతాయని సమాచారం. ప్రస్తుతం గ్యాలరీలకు సంబంధించిన పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. భారీ టెంట్ల ఏర్పాటు పనులకు సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. మీడియం గ్యాలరీ టెంట్‌ పనులను ముందుగా శరవేగంగా చేపడుతున్నారు. దాదాపుగా స్కెల్‌టెన్‌ పనులు పూర్తయ్యాయి. ఇక పైకప్పు వేయటమే మిగిలి ఉంది. దీని వెంబడే మరో రెండు గ్యాలరీల టెంట్ల పనులు కూడా సోమవారం నుంచి చేపట్టనున్నారు. సభా ఏర్పాట్లను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉంది. సభా వేదిక ఏర్పాట్లన్నింటిని కూడా జనరల్‌ అడ్మినిస్ర్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (జీఏడీ) మాత్రమే చూసుకుంటోంది. సీఆర్‌డీఏ, ఏడీసీల పాత్ర కూడా చాలా పరిమితమనే చెప్పాలి. భూములు ఎక్కడ అవసరమో వాటిని చూపించటం మాత్రమే సీఆర్‌డీఏ పనిగా ఉంది. సీఆర్‌డీఏ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ .. జీఏడీ డైరెక్షన్‌ ప్రకారమే అవి పనిచేయాల్సి వస్తోంది.

సచివాలయం వెనుక.. 100 ఎకరాల్లో ఏర్పాట్లు

సభా వేదిక పనులన్నీ కూడా ప్రస్తుతం ఏపీ సచివాలయం వెనుకనే జరుగుతున్నాయి. కిందటి సారి ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినపుడు కేవలం భూములు మాత్రమే ఉన్నాయి. ఈ సారి మోదీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తాత్కాలిక సెక్రటేరియట్‌ను వీక్షించే అవకాశం ఉంది. సచివాలయం వెనుక మొత్తం 100 ఎకరాలలో సభా వేదికలు, గ్యాలరీలు, ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణ పరిసరాలలోనే వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నారు.

వీఐపీలు వెళ్లే రోడ్లు, సుందరీకరణ బాధ్యతలు ఏడీసీఎల్‌కు

అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌)కు రాజధాని ప్రాంత సుందరీకరణ, రోడ్ల అభివృద్ధి బాధ్యతలను అప్పగించటం జరిగింది. ఈ పనుల్లో ఏడీసీఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. వీఐపీలు సభాస్థలికి వచ్చే రోడ్లన్నింటినీ ఏడీసీఎల్‌ అధికారులు బాగు చేస్తున్నారు. రోడ్ల వెంబడి ఆకర్షణీయమైన మొక్కలను నాటుతున్నారు. అవసరమైన చోట లాన్లను వేస్తున్నారు. ఎటు చూసినా అమరావతి ప్రాంతం అంతా స్వచ్చంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 21 , 2025 | 01:15 AM