ARSA Clusters: అర్సాపై రాద్ధాంతం
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:50 AM
విశాఖలో 60 ఎకరాల భూమి కేటాయింపుపై అర్సా క్లస్టర్స్‌పై వైసీపీ విమర్శలు చేయడంతో, కంపెనీ ప్రతినిధులు జవాబు ఇచ్చారు. తమ కంపెనీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు.
భూకేటాయింపులను తప్పుబట్టిన కేశినేని నాని
సోదరుడిపై అక్కసుతోనే ఆరోపణలు
ఖండించిన అర్సా యాజమాన్యం
చిన్నికి మా కంపెనీతో సంబంధం లేదు
పెట్టుబడి పెట్టేవారిపై దుష్ప్రచారం తగదు
గడువులోగా ప్రాజెక్టు చేయకుంటే ప్రశ్నించండి : అర్సా
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగా అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల భూమిని కేటాయించాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అయితే, అర్హత లేని కంపెనీకి అన్ని ఎకరాలు ఎలా కేటాయిస్తారంటూ వైసీపీ అప్పటి నుంచి విమర్శలు చేయడం మొదలుపెట్టంది. మంగళవారం విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అర్సా క్లస్టర్స్‌పై ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని నానీ ఆరోపణలు గుప్పించారు. ‘‘అర్సా కంపెనీ నా సోదరుడు చిన్ని రూపొందించిన బినామీ కంపెనీ. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీశ్...చిన్నికి సన్నిహితుడు, ఇంజనీరింగ్‌లో క్లాస్‌మేట్. భూకేటాయింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాల ముందే ఈ కంపెనీని స్థాపించారు’’ అని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై అర్సా క్లస్టర్స్ యాజమాన్యం స్పందించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించాలని భావిస్తున్న కంపెనీలపై రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం బాధతోపాటు నిరుత్సాహాన్ని కలిగించిందని ఆ కంపెనీ కోఫౌండర్ సతీశ్ అబ్బూరి, ప్రమోటర్ జయ్ తాళ్లూరి అన్నారు. అర్సా క్లస్టర్స్‌కు విశాఖలో భూకేటాయింపులపై వస్తున్న విమర్శలపై సతీశ్, జయ్, అర్సా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎరిక్ వార్నర్ అమెరికా నుంచి మంగళవారం రాత్రి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘మా కంపెనీ ప్రపంచస్థాయిలో డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. భారతదేశంలో ఇటీవలే మా కార్యకలాపాలు ప్రారంభించాం. ఎంపీ కేశినేని చిన్నితో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భారతదేశంలో తాత్కాలిక కార్యాలయం ద్వారా సేవలందిస్తున్నాం.
త్వరలోనే శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. మా ప్రాజెక్టులను ఫేజ్-1 దశ అమలుకు అవసరమైన ఆర్థిక బలం మాకు సొంతంగా ఉంది’’ అని తెలిపారు. రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా జగన్ రోత మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై స్పందిస్తూ... తాము పెట్టే పెట్టుబడులు ఆర్బీఐ అనుమతించిన ఎఫ్‌డీఐ పాలసీతో ఏపీకి వస్తాయని జయ్ తాళ్లూరి చెప్పారు. అర్సా క్లస్టర్స్ ప్రమోటర్లు అందరూ ఆర్థికంగా బలమైన వారని, సంస్థ ఆర్థికసామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్‌కు, ఏఐ రంగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తాము వివిధ దేశాలు, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో డేటాసెంటర్స్ ఏర్పాటు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధమయ్యామని, ఏపీ నుంచి ఆహ్వానం రావడంతో వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చామన్నారు. విశాఖలో మూడు దశల్లో రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని, దానికి రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా భూమి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కాపులప్పాడులో ఎకరం రూ.50 కోట్ల విలువ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమకు 99 పైసలకు ఎకరా కేటాయించారన్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. విశాఖ ఐటీ పార్కు వద్ద కేటాయించిన భూమి ఎకరా రూ.కోటి, కాపులుప్పాడు వద్ద కేటాయించిన భూమిఎకరా రూ.50 లక్షలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమకు కేటాయించిన భూమిలో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉందని, రెండు వేల మందికి ఉపాధి లభించడంతోపాటు పరోక్షంగా కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ‘‘మేం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఎంవోయూలో ఉంది. నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మాపై ఆరోపణలు చేయండి. తప్పు లేదు. కానీ, ప్రారంభంలోనే విమర్శలు చేయడం సరైన విధానం కాదు. మేం ఏర్పాటు చేసే డేటాసెంటర్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల రాష్ట్రంలోని ప్రతి చిన్న పట్టణంలోనూ స్టార్ట్‌పలను ప్రారంభించే వాతావరణం ఏర్పడుతుంది’’ అని జయ అన్నారు.
తమ కంపెనీకి వెబ్‌సైట్ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... విజయవాడ ఎంపీతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని సతీశ్ అబ్బూరి తెలిపారు. తెలంగాణలో కూడా డేటాసెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కూడా 50 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. భారతదేశంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఏపీలో కంపెనీని రిజిస్టర్ చేశామని, త్వరలోనే పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపడతామన్నారు. అర్సా క్లస్టర్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎరిక్ వార్నర్ మాట్లాడుతూ.. తమ సంస్థ క్లయింట్ బేస్ అని, చాలా దేశాల్లో ఉందన్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికాతోపాటు భారత్‌లోనూ ఆదాయవనరులపై సమగ్ర అధ్యయనం చేసి క్లయింట్ బేస్‌ను గుర్తించామని చెప్పారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..