సమస్యలతో సహవాసం
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:28 AM
జిల్లాలోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. పూడిక తీతకు నోచుకోని కాలువలు, డ్రెయిన్లు పంటలను ముంచేస్తున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు కరువై జగనన్న కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత సబ్సిడీ అందక ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అభివృద్ధికి నోచుకోని రహదారులు, తాగు, సాగు నీటి సమస్యలు జిల్లా వాసులను వేధిస్తున్నాయి.
-అస్తవ్యస్తంగా ధాన్యం కొనుగోళ్లు
-పూడికతీతకు నోచుకోని పంట కాలువలు
- మౌలిక సదుపాయాలు లేక జగనన్న కాలనీల్లో అవస్థలు
- అభివృద్ధికి నోచుకోని రహదారులు
- విద్యుత సబ్సిడీ అందక ఆక్వా రైతుల పాట్లు
- నేటి జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా సమస్యలపై చర్చించేనా!
జిల్లాలోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. పూడిక తీతకు నోచుకోని కాలువలు, డ్రెయిన్లు పంటలను ముంచేస్తున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు కరువై జగనన్న కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత సబ్సిడీ అందక ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అభివృద్ధికి నోచుకోని రహదారులు, తాగు, సాగు నీటి సమస్యలు జిల్లా వాసులను వేధిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన జెడ్పీ సమావేశపు హాలులో జిల్లా సమీక్షా సమావేశం గురువారం జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్ర, శాసన సభ్యులు, ఎంపీ, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తొలి జిలా ్లసమీక్షా సమావేశం కావడంతో ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఒకసారి సమావేశం నిర్వహించినా, అది అధికారులను పరిచయం చేసుకునే కార్యక్రమంగానే పరిగణించారు. ఈ సమావేశంలోనైనా జిల్లా సమస్యలపై దృష్టి సారిస్తారా అనే చర్చ ప్రధానంగా నడుస్తోంది.
రైతు కష్టాలు
గత ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి జిల్లాలో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో 10 వేల హెక్టార్లలో రబీ సీజన్‌లో వరిసాగు చేశారు. ప్రస్తుతం వరికోతలను యంత్రాల ద్వారా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు అనుమతులు కూడా ఇచ్చింది. రబీ సీజన్ ధాన్యం మిల్లర్లు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ధాన్యంలో తేమశాతం, నూకశాతం అధికంగా ఉందనే కారణంతో బస్తా ధాన్యం రూ.1,725లకు బదులుగా రూ.1,200లకు కొనుగోలు చేస్తున్నారు. బాయిల్డ్ రైస్ మిల్లులకు అయితేనే ఈ ధాన్యం పనికొస్తుందని, ఈ మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలుకు టార్గెట్‌లు ఇవ్వలేదనే కారణం చూపి ధాన్యం ధరలను తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. తాము నిర్ణయించిన ధరకు ధాన్యం విక్రయించేందుకు ముందుకు వస్తేనే రైతులకు గోనె సంచులను మిల్లర్లు ఇస్తున్నారు. రబీ సీజన్‌లో ఎకరానికి 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తున్నా ధాన్యం ధరలో కోత పెట్టడంతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని కాలువలు
జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. కృష్ణాడెల్టాలో వరిసాగు నిమిత్తం జూన్ 10వ తేదీన సాగునీటిని విడుదల చేస్తే అక్టోబరు నెలలోనే వరికోతలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో కాలువలకు సాగు నీటిని విడుదలచేస్తే సాగు ఆలస్యమై నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే భారీ వర్షాలకు పంట దెబ్బతింటోంది. జిల్లాలో ఈ ఏడాది పంట కాలువలు, డ్రైనేజీలలో 722 ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు రూ.36.72 కోట్లతో అంచనాలను రూపొందించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఈ పనులకు అనుమతులు రావాల్సి ఉంది. ఏప్రిల్ నెల కూడా పూర్తవుతోంది. ఈ నెలాఖరులోగా పనులకు అనుమతులు వస్తే మే నెలలో పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఎనిమిది అవుట్‌ఫాల్ స్లూయిస్‌గేట్లకు కనీస మరమ్మతులు చేసేందుకు రూ.38 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈపనులపైన నేడు జరిగే సమావేశంలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నూతన కాలనీల్లో మౌలిక వసతులు కరువు
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 665 లేఅవుట్‌లు ఉన్నాయి. వీటిలో 86,084 గృహాలను నిర్మాణం చేయాల్సి ఉంది. 28,456 గృహాలకుపైగా ఇప్పటివరకు నిర్మాణం చేశారు. 29,080 గృహాల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. 28,548 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నూతనంగా నిర్మాణం చేసిన గృహాల మధ్యన ఉన్న రహదారులను మెరక చేయకపోవడంతో అక్కడ నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని మండలాల్లో లేఅవుట్‌లలో రోడ్ల నిర్మాణం, తాగునీటి పైపులైన్లు, విద్యుత లైన్‌ల పనులు చేపట్టే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
పశువైద్యశాలల్లో మందుల కొరత
జిల్లాలో 29,261 ఆవులు, 3.50 లక్షల గేదెలు, 1.71 లక్షల గొర్రెలు, 40,500 మేకలు ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమ ఉంటోంది. జిల్లాలో ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు 13, వెటర్నరీ ఆస్పత్రులు 59, గ్రామీణ పశువైద్యశాలలు 101 ఉన్నాయి. వీటిలో పశువులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండటం లేదు. పశువులు అనారోగ్యం పాలైన సమయంలో ఆస్పత్రులకు వాటిని తీసుకువెళితే అవసరమైన మందులు బయటనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఈ అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
విద్యుత రాయితీ రాక ఆక్వా రైతుల అవస్థలు
జిల్ల్లాలో ఈ ఏడాది 32,804 ఎకరాల భూమిని ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. రొయ్యల చెరువులకు విద్యుత సబ్సిడీ రాకపోవడంతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. రొయ్యల చెరువులకు విద్యుత రాయితీ ఇచ్చే అంశంపైనా ఈసమావేశంలో నిర్ణయం తీసువాలని రైతులు కోరుతున్నారు.
కొలిక్కిరాని పాఠశాలల విలీనం
జిల్లాలో పలు పాఠశాలల విలీనంపై కసరత్తు జరుగుతోంది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఖఛ్చితంగా ఉండాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. పాఠశాలల విలీనంపై ఇంకా గందరగోళ పరిస్థితులున్నాయి. ఈ అంశంపైనా చర్చించి ప్రభుత్వ పాఠశాలలు గ్రామాల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. బందరు పోర్టు, గిలకలదిండి హార్బర్ పనులను వేగవంతం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.