Share News

బుడమేరుతో జాగ్రత్త!

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:46 AM

బెజవాడ దుఖఃదాయని అయిన బుడమేరుతో తస్మాత జాగ్రత్త. ఈ ఏడాది కూడా ‘లానినా’ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుడమేరు పునరుద్ధరణ పనులకు ఇదే అనువైన సమయం. వర్షాకాలానికి ముందే తాత్కాలిక పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి శాస్త్రీయమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే బుడమేరు ముప్పును మరోసారి ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది.

బుడమేరుతో జాగ్రత్త!

- ఈ ఏడాది ‘లానినా’ ప్రభావంతో భారీ వర్షాలు!

- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

- బుడమేరు పునరుద్ధరణ పనులకు ఇదే అనువైన సమయం

- వర్షాకాలానికి ముందే తాత్కాలిక పనులు పూర్తి చేయాలి

- శాశ్వత పరిష్కారానికి శాస్ర్తీయమైన ప్రతిపాదనలు అవసరం

- నాడు మూడు లక్షల మంది వరద ముంపును చవిచూశారు

బెజవాడ దుఖఃదాయని అయిన బుడమేరుతో తస్మాత జాగ్రత్త. ఈ ఏడాది కూడా ‘లానినా’ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుడమేరు పునరుద్ధరణ పనులకు ఇదే అనువైన సమయం. వర్షాకాలానికి ముందే తాత్కాలిక పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి శాస్త్రీయమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే బుడమేరు ముప్పును మరోసారి ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

వాతావరణశాఖ ఈ ఏడాది కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలను జారీ చేసింది. వీటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతేడాది కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. హెచ్చరించినట్టుగానే జూన్‌ - సెప్టెంబరు మధ్య కాలంలో భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ నగరం అటు కృష్ణానది, ఇటు బుడమేరు భారీ వరదలను చవిచూసింది. కొన్ని రోజుల పాటు అతలాకుతలమైంది. ఈ ఏడాది కూడా ‘లానినా’ ప్రభావం కారణంగా భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విజయవాడకు దుఖఃదాయనిగా మారిన బుడమేరు పట్ల జాగ్రత్త వహించాలి. బుడమేరు వరదలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుడమేరు విలయం గాయాలు మానకముందే మరో ప్రమాద హెచ్చరికలు వస్తుండటంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వర్షాకాలానికి ముందుగానే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా బుడమేరు సమస్యకు పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంది.

బుడమేరు ప్రయాణం ఇలా..

కొల్లేరు బేసిన్‌లో బుడమేరు అనేది ఒక చిన్న నది. కానీ దీన్ని మనం కాలువగానే భావిస్తాం. ఎందుకంటే నదిలాగా నిరంతర ప్రవాహం ఉండదు. ఆ రూపు కూడా కనిపించదు. కానీ పరివాహక ప్రాంతం అయితే ఉంటుంది. బుడమేరు పొడవు మొత్తం 130 కిలోమీటర్లు. విజయ వాడ నగరంలో బుడమేరు 36 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది. బుడమేరు పరిధిలో ఎన్టీఆర్‌ జిల్లాలో ఏ కొండూరు, రెడ్డిగూడెం, జీ కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌, విజయవాడ అర్బన్‌ ప్రాంతాలు ఉండగా.. కృష్ణాజిల్లాలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, నందివాడ మండలాలు ఉన్నాయి. బుడమేరు అనేది ఏ కొండూరు మండలంలోని కొండల దగ్గర జమ్మలవోలు దుర్గం నుంచి ప్రారంభమవుతుంది. వెలగలేరులోని హెడ్‌ రెగ్యులేటర్‌కు వచ్చేసరికి 43 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తుంది. విజయవాడలో 36 కిలోమీటర్ల మేర ప్రవహించిన తర్వాత ఎనికేపాడు యూటీ దగ్గరకు వచ్చేసరికి బుడమేరు నది కాస్తా బుడమేరు డ్రెయిన్‌గా మారుతుంది. వాస్తవంగా చూస్తే విజయవాడ నగరం అంతా కూడా డ్రెయిన్‌గానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏ కొండూరు నుంచి కూడా డ్రెయిన్‌గానే ఉంటుంది. దిగువకు ప్రవహించాక కొల్లేరు నదిలో కలుస్తుంది. కొల్లేరు నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లిపోతుంది.

ఒక్క రోజులోనే అతలాకుతలం

గతేడాది ఆగస్టు 30, 31వ తేదీల్లో 25 నుంచి 42 సెంటీమీటర్ల మేర అత్యంత తీవ్ర వర్షాలు కురిశాయి. ఎడతెరపివ్వకుండా వర్షం కురవటంతో కేవలం ఒక్కరోజులోనే వరదలు పోటెత్తాయి. ఈ వరదల కారణంగా బుడమేరు గట్లకు భారీ నష్టం వాటిల్లింది. బుడమేరు ఉపకాలువులైన పులివాగు, కోతులవాగు, కొండవాగులు కూడా దెబ్బతినటంతో రైతుల పొలాలు, గ్రామాలు, విజయవాడ నగరం ముంపునకు గురైంది. విజయవాడ నగరంలో మూడు లక్షల మంది ప్రజలు వరద ముంపును చవిచూశారు.

బుడమేరు కాలువకు తీరని నష్టం

అకాల వరదల వల్ల బుడమేరు కాలువకు కూడా తీరని నష్టం జరిగింది. వెలగలేరులోని హెడ్‌ రెగ్యులేటర్‌ దెబ్బతింది. రెగ్యులేటర్‌ గేట్లు పాడయ్యాయి. ఈఎం పార్ట్స్‌, మాసనరీ పార్ట్స్‌, ఎలక్ర్టికల్‌ నెట్‌వర్క్‌, హోయిస్ట్‌ అరేంజ్‌మెంట్‌ వంటివి తీవ్రంగా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. బుడమేరు బండ్‌కు పలు చోట్ల నష్టం ఏర్పడింది. పులివాగు, కోతుల వాగు, కొండ వాగులు దెబ్బతిన్నాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సి ఉంది.

శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు

బుడమేరుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వరదల అనంతరం సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత బుడమేరు ఆక్రమణలు, బుడ మేరు గండ్లు, దెబ్బతిన్న కాలువలు, విజయవాడ నగరానికి శాశ్వతంగా వరద ప్రభావం లేకుండా చేయాల్సిన పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిష్కరించాలంటే మాత్రం రూ.1000 కోట్లు నుంచి రూ.1500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాగా ఉంది. ఆక్రమణల తొలగింపు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున ముందుగా బుడమేరు యథాతధ పరిస్థితులకు అనుగుణంగా అయినా అభివృద్ధి పరచాలన్నా కూడా రూ. 1000 కోట్లు అవుతుంది. బుడమేరు కాలువకు రెండు వైపులా రీటెయినింగ్‌ వాల్‌ కట్టాలన్న ప్రతిపాదనల వల్ల ఈ మేరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ కాకుండా బుడమేరును పటిష్ట పరచాలంటే రూ.100 కోట్ల నిధులు అవసరం అన్నది మరో అంచనా తయారు చేశారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

వర్షాకాలం నాటికి చేయాల్సిన పనులు

శాస్ర్తీయమైన ప్రతిపాదనలు సిద్ధం చేసే లోపు రానున్న వర్షాకాలానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ.35.45 కోట్లను కేటాయించింది. మొత్తం 185 పనులను చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. బుడమేరు, పులివాగు పటిష్టతకు వీలుగా 28 పనులు చేసేందుకు రూ.11.71 కోట్ల నిధులను కేటాయించింది. వెలగలేరు రెగ్యులేటర్‌ మరమ్మతులకు రూ.1.86 కోట్లను విడుదల చేసింది. ఇవి కాకుండా బుడమేరు ఆధారితమైన మీడియం ఇరిగేషన్‌కు సంబంధించి ఐదు పనులకు రూ.2.82 కోట్లను కేటాయించింది. మైనర్‌ ఇరిగేషన్‌కు సంబంధించి మొత్తం 151 పనులకు రూ.19.06 కోట్లను విడుదల చేసింది. ఈ పనులన్నింటినీ ఇప్పుడు చేపడితేనే వచ్చే వర్షాకాలం నాటికి ఫలితం కనిపిస్తుంది. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో కదలిక లేకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పూర్తి చేసి పనులన్నింటినీ అప్పగించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 22 , 2025 | 12:46 AM