Share News

ఇట్లా పనులు చేయగలరా?

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:16 AM

వంద రూపాయలతో చేయాల్సిన ఒక పనిని రూ.60లకు చేస్తే.. నాణ్యతా ప్రమాణాలు గంగలో కలుస్తాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లోని మాయాజాలం వల్ల విచిత్రాలు ఎన్నయినా జరుగుతాయి.

   ఇట్లా పనులు చేయగలరా?
కౌతాళం సమగ్ర రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్‌) ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

40 శాతం తక్కువకు టెండర్లు

పనుల్లో నాణ్యత సాధ్యమేనా?

ఉమ్మడి జిల్లాలో 44 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు

నిర్వహణకు రూ.40.07 కోట్లతో టెండర్లు

పలు స్కీంలకు 40.01 శాతం తక్కువ ధరలకు షెడ్యూల్‌ దాఖాలు

పల్లె ప్రజలకు తాగునీటి సరఫరాలో మాయాజాలం

కర్నూలు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వంద రూపాయలతో చేయాల్సిన ఒక పనిని రూ.60లకు చేస్తే.. నాణ్యతా ప్రమాణాలు గంగలో కలుస్తాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లోని మాయాజాలం వల్ల విచిత్రాలు ఎన్నయినా జరుగుతాయి. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ తాగునీటి సరఫరా కోసం సమగ్ర రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణలో ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ స్టాండర్డ్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం టెండర్లు పిలిచారు. 10 శాతం వరకు తక్కువ ధరలకు టెండర్లు వేయడం సహజం. 25 శాతం వరకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఏకంగా 40 శాతం తక్కువకే తాగునీటి సరఫరా చేస్తాం అంటూ పలు స్కీంలకు కాంట్రాక్టర్లు షెడ్యూల్‌ దాఖలు చేశారు. ఇది ఎలా సాధ్యం..? అని ఇంజనీర్లే ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా పనులు దక్కించుకొని ఆ తరువాత ఇంజనీర్లు, అధికార కూటమి ప్రజా ప్రతినిధుల అండతో మాయ చేయవచ్చేనే ఉద్దేశంతో టెండర్లు వేసి ఉంటారనే ఆరోపణులు లేకపోలేదు. దీని వెనుక ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారి పాత్ర ఉందనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. టెండర్లు పూర్తై 20 రోజులైనా కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ చేసుకోలేదు. ఈ వివరాలపై ప్రత్యేక కథనం.

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గ్రామీణ తాగునీరు సరఫరా, పారిశుధ్యం శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌) పర్యవేక్షణలో 60 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) ఉన్నాయి. 555 గ్రామాలకు శుద్ధి చేసిన (ఫిల్టర్‌) తాగునీరు అందిస్తున్నారు. వీటి నిర్వహణకు ఆపరేషన అండ్‌ మెయింటెనెన్స (ఓ అండ్‌ ఎం) గ్రాంట్‌ కింద ప్రభుత్వం ఏటేటా రూ.85.71 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. కర్నూలు జిల్లాలో 354 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం 33 సీపీడబ్ల్యూఎస్‌ స్కీంల నిర్వహణకు రూ.49.29 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో 201 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంగా 27 సీపీడబ్ల్యూఎస్‌ స్కీంల నిర్వహణకు రూ.36.42 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జిల్లా పరిషత (జడ్పీ) నిధులు మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. తాగునీటి పథకాలు నిర్వహణ, తాత్కాలిక మరమ్మతులు, సిబ్బంది జీతాలు, విద్యుత బిల్లులు కోసం నిధులు వెచ్చించాలి. నిర్వహణ బాధ్యతలు టెండర్లు ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆయా సీపీడబ్ల్యూఎస్‌ స్కీంల ద్వారా గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తే.. ఎస్‌ఎస్‌ ట్యాంకు, ఫిల్టర్‌ బెడ్స్‌ నుంచి నీటి సరఫరా చేసే గ్రామాలకు మధ్య దూరాన్ని బట్టి కిలో లీటరు (1,000 లీటర్లు)కు కనిష్ఠంగా రూ.6.24 గరిష్ఠంగా రూ.14 చెల్లిస్తారు. రోజు వారిగా ఏ గ్రామానికి ఎంత నీటిని సరఫరా చేశారో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎం-బుక్‌ రికార్డులు చేసి బిల్లులు చెల్లించాలి.

ఫ 40.01 శాతం తక్కువ రేట్లకు టెండర్లు:

కర్నూలు జిల్లాలో 25, నంద్యాల జిల్లాలో 19 సీపీడబ్ల్యూఎస్‌ స్కీంలు 2025-26లో నిర్వహణకు రూ.40.07 కోట్లతో గత నెల (మార్చి) 3న ఏపీ ఇ-ప్రొక్యుర్‌మెంట్‌ టెండర్‌ నోటీస్‌ ఏటీఓ/81 నుంచి 124/2024-25 కింద గ్రామీణ తాగునీరు సరఫరా, పారిశుధ్యం శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌) సూపరింటెండెంట్‌ ఇంజనీరు (ఎస్‌ఈ) టెండర్లు పిలిచారు. అదే నెల 12వ తేది నుంచి టెండరు బిడ్‌ షెడ్యూల్‌ డౌనలోడ్‌ చేసుకొని.. ఆఖరు తేది 25వ తేదిలోగా ఆనలైనలో టెండరు షెడ్యూల్‌ దాఖలు చేశారు. అదే రోజు టెక్నికల్‌ బిడ్‌, ఆ తరువాత ప్రైజ్‌ బిడ్‌ ఓపన చేశారు. ఇంజనీర్లే విస్తుపోయేలా ఆదోని డివిజన పరిధిలో పెసలబండ, కుప్పగల్‌, హాల్వి, కౌతాళం, సాతనూరు, మండిగిరి సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు ఓ కాంట్రాక్టర్‌ ఏకంగా ప్రతిపాదన టెండర్‌ రేట్లకు 40.01 శాతం తక్కువ ధరలకు టెండరు షెడ్యూల్‌ దాఖలు చేశారని ఇంజనీర్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 25 శాతం వరకు తక్కువ ధర (లెస్‌)కు టెండర్‌ వేస్తే ఆమోదిస్తారు. లెస్‌కు 25 శాతం కంటే ఎంత ఎక్కువ వేశారో.. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్‌ డిపాజిట్‌ చేశాకే అగ్రిమెంట్‌ చేసుకోవాలి. ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించే తాగునీటి పథకాల నిర్వహణలో కాంట్రాక్టర్లు ప్రతిపాదన రేట్ల కంటే 40 శాతం తక్కువకే నీటిని సరఫరా చేయడం సాధ్యమేనా..? టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి జడ్పీ సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఇదే అంశంపై గట్టిగా నిలదీస్తే ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇందులో మర్మమేమిటో నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. అత్యల్పంగా నంద్యాల జిల్లాలో 44 గ్రామాలకు తాగునీరు అందించే ఆళ్లగడ్డ రక్షిత మంచినీటి పథకం నిర్వహణకు రూ.1.21 కోట్లకు టెండర్లు పిలిస్తే 0.35 శాతం తక్కువ, మెజార్టీ స్కీంలకు 25 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసినట్లు తెలుస్తున్నది.

ఫ అగ్రిమెంట్‌ చేయడంతో జాప్యం ఎందుకో..?:

టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి 21 రోజులు గడిచినా టెండరు దక్కించుకున్న ఎల్‌-1 కాంట్రాక్టరుతో అగ్రిమెంట్‌ చేయకపోవడం వెనుక అంతర్యమేమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 40 సీపీడబ్ల్యూఎస్‌ స్కీంలకు టెండర్లు పిలిచారు. అందులో 18 స్కీంలకే కోర్టు కేసులు ఉన్నాయి. మిగిలిన 22 స్కీంలకు కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోలేదు. అయితే.. కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆదోని డివిజన పరిధిలో 5, నంద్యాల డివిజన పరిధిలో 5 స్కీంలకు మాత్రమే రెండు మూడు రోజుల క్రితం అగ్రిమెంట్‌ చేసినట్లు తెలుస్తుంది. అగ్రిమెంట్‌ చేయాలంటే టెండరు విలువపై 1-2 శాతం మామూళ్లు ఓ ఉన్నతాధికారి డిమాండ్‌ చేయడం వల్లేనే జాప్యం జరుగుతుందనే ఆరోపణులు లేకపోలేదు. అంతేకాదు.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇనచార్జి బాధ్యతలు చేపట్టిన ఆ అధికారికి ఇప్పటికీ ఆ వాసన పోలేదని, వైసీపీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్లకే తెరవెనుక మద్దతు ఇస్తూ.. టీడీపీ కూటమి సానుభూతిపరులైన కాంట్రాక్టర్లను లేనిపోని కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవంగా మార్చి 31వ తేదిలోగా టెండర్లు ప్రక్రియ, అగ్రిమెంట్‌ పూర్తి చేసి ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుంచి సీపీడబ్ల్యూఎస్‌ స్కీంల నిర్వహణ బాధ్యతలు ఓ అండ్‌ ఎం కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉండేది. జాప్యం ఎందుకో..? అధికారులే సమాధానం చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు వివరణ కోసం ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Apr 22 , 2025 | 12:16 AM