Chandrababu Naidu Amit Shah Meeting: అమరావతికి మద్దతివ్వండి
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:12 AM
అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు. జల జీవన్ మిషన్, పోలవరం లింక్ ప్రాజెక్ట్, ఆక్వా రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులతో విస్తృతంగా చర్చించారు.
అమరావతిలో క్వాంటమ్ విలేజ్ దేశంలోనే తొలిసారి
హైటెక్ సిటీని తలదన్నేలా ఐకానిక్ బిల్డింగ్
చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడానికి అండగా ఉండండి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జగన్ హయాంలోని మద్యం కుంభకోణం గురించి ప్రస్తావన?
కర్నూలులో హైకోర్టు బెంచ్, పోలవరం-బనకచర్లకు సాయం
అమెరికా సుంకాల నుంచి ఆక్వా రైతులను కాపాడండి
కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): అమరావతిలో రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్న రాజధాని నిర్మాణం చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి డిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. మంగళవారం అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర ప్రాజెక్టులు, పథకాల గురించి చర్చించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబును అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక నిర్ణయాలతో రాజధాని నిర్మాణం ఐదేళ్లు వెనక్కు వెళ్లిందని, ఈ పరిస్థితిని సరిదిద్ది ఏపీ ప్రజలకు ఒక భవ్యమైన రాజధానిని త్వరితగతిన నిర్మించేందుకు కేంద్రం పూర్తి మద్దతునివ్వాలని కోరారు. రాష్ట్రాన్ని గాడినపెట్టేందుకు గత 10 నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన అమిత్ షాకు వివరించారు. కాగా, జగన్ హయాంలో పెద్దఎత్తున జరిగిన మద్యం కుంభకోణం గురించి కూడా చంద్రబాబు ఆయనకు వివరించినట్టు తెలిసింది. దీనితో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని, దాని ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని అనేక రకాలుగా మళ్లించారని ఆయన చెప్పినట్టు సమాచారం.
కేంద్ర మంత్రులతో భేటీ
జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర అటల్ భూజల్ యోజనపైనా కేంద్రమంత్రితో చర్చించారు. భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి, ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సీఎం సమావేశమయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కాగా, ఏపీలోని ఆక్వా రైతులను ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాల కారణంగా ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఫుడ్‌పై విధించిన 26శాతం సుంకాలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని వివరించారు. అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..