Chiranjeevi: పవన్ కల్యాణ్ స్పీచ్‌కు మెగాస్టార్ ఫిదా..
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:55 PM
తమ్ముడు పవన్ కల్యాణ్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. పవన్ స్పీచు గురించి చాలా ఎమోషనల్‌గా ఆ పోస్టు పెట్టారు. పవన్ స్పీచుకు తాను ఫిదా అయిపోయానని చిరు అన్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన పవర్ ఫుల్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమ్ముడు పవన్ స్పీచ్ చూసి ఫిదా అయిపోయానని అన్నారు. తమ్ముడి స్పీచ్ గురించి చెబుతూ చాలా ఎమోషల్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ ప్రియమైన నా తమ్ముడు పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నువ్వు ఇచ్చిన స్పీచ్ చూసి ఫిదా అయిపోయాను. సభలో పాల్గొన్న అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగిపోయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్పూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జనసైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
హాట్ టాపిక్‌గా పవన్ స్పీచ్
గురువారం పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పీచ్, మాట్లాడిన కొన్ని విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. స్పీచ్ మొదట్లోనే పవన్ కల్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడారు. ఆంధ్ర గడ్డ మీద జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నా తెలంగాణ కోటిరతనాల వీణ అంటూ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘ కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలు, నా అభిమానుల దీవెనలే. జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ. నాకు గద్దర్ అంటే అభిమానం. నేను దారథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాను. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా అనే మాటు నిజం చేశాం’ అని అన్నారు.