మీ ఊరికి రండి!
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:53 AM
కృష్ణాజిల్లా అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి చిలుకూరి ఉషా వాన్స్ రెండు రోజుల భారతదేశ పర్యటనకు వచ్చారు. ఉషా వాన్స్ స్వగ్రామం అయిన ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామస్థులు మాత్రం ‘మీ ఊరు రండి’ అంటూ ఆమెకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
-ఉషా వాన్స్‌కు సాయిపురం గ్రామవాసుల ఆహ్వానం
- టైట్ షెడ్యూల్ వల్ల ఏపీకి రాలేని పరిస్థితి
- మరోసారి ప్రత్యేకంగా కృష్ణాజిల్లాకు ఆహ్వానిస్తామని చెబుతున్న బంధువులు
- ఉషా వాన్స్ స్వగ్రామం వస్తుందేమోనని ఎదురుచూసిన సాయిపురం గ్రామప్రజలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణాజిల్లా అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి చిలుకూరి ఉషా వాన్స్ రెండు రోజుల భారతదేశ పర్యటనకు వచ్చారు. ఉషా వాన్స్ స్వగ్రామం అయిన ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామస్థులు మాత్రం ‘మీ ఊరు రండి’ అంటూ ఆమెకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉషా వాన్స్ మూలాలు సాయిపురం గ్రామంలోనే ఉన్నాయి. ఉషావాన్స్ తాతయ్య అయిన చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్ర్తిది సాయిపురం గ్రామం. 1970లోనే ఉషా వాన్స్ తండ్రి చిలుకూరి రాధాకృష్ణ, తల్లి లక్ష్మి అమెరికాకు వలస వెళ్లారు. దీంతో ఉషా బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. ఆమె పూర్వీకులు ఎవరూ ఇప్పుడు సాయిపురంలో లేరు. అమెరికా ఉపాఽధ్యక్షుడి సతీమణి కావటంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఉషా వాన్స్ ఇండియాకు రావటంతో ఆమెను చూడటానికి సాయిపురం గ్రామస్థులు ‘మీ ఊరు రండి’ అంటూ పిలుస్తున్నారు. అయితే ఉషావాన్స్ ఇండియాలో కేవలం రెండు రోజుల షెడ్యూల్ ఉండటంతో సాయిపురం వచ్చే అవకాశం లేదని సాయిపురం గ్రామ వాసి (ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు) చిలుకూరి రామ్మోహనరావు ‘ఆంధ్రజ్యోతి‘కి చెప్పారు. రామ్మోహనరావు ఉషా వాన్స్ తాతయ్య అయిన రామశాస్ర్తి చిన్న సోదరుడు. చాలా టైట్ షెడ్యూల్ ఉందని, ఈ కారణంగా ఏపీకి రాలేకపోతున్నారని తెలిపారు. ముఖ్య బంధువులు చెన్నైలో ఉన్నారు. ఉషా వాన్స్ మేనత్త శారద అక్కడే ఉన్నారు. ఆమెను కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ ఉషా వాన్స్‌కు అమ్మమ్మ వరుస అవుతారు. ఆమెకు ఇప్పుడు 96 సంవత్సరాలు. వీరందరినీ చూడటానికి రావచ్చనుకున్నా.. టైట్ షెడ్యూల్ వల్ల వీలుపడటం లేదని తెలుస్తోంది. మరో ప్రత్యేక సందర్భం చూసుకుని తాము ఉషా వాన్స్‌ను కృష్ణాజిల్లాకు తీసుకురావటానికి ఆహ్వానం పలుకుతామని చిలుకూరు రామ్మోహనరావు వివరించారు.