Share News

అన్నదాతకు ని‘బంధనాలు’!

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:31 AM

అన్నదాతలు నిబంధనల చట్రంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పండించిన ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి రాకతో కుప్ప నూర్పిళ్లు ముమ్మరం చేసిన రైతులు ధాన్యం ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ చేయలేక స్థానిక మిల్లులకు తరలించారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు నిబంధనల బాంబు పేల్చారు. జీపీఎస్‌ ఉన్న వాహనాల్లోనే ధాన్యం తరలించాలని, ముందుగా ధాన్యం మిల్లులకు పంపితే బిల్లులు రావంటూ స్పష్టం చేశారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిబంధనలు సడలించాలని వేడుకుంటున్నారు.

అన్నదాతకు ని‘బంధనాలు’!

- ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు

- జీపీఎస్‌ ఉన్న వాహనాల్లోనే ధాన్యం తరలించాలని స్పష్టం

- ముందుగా ధాన్యం మిల్లులకు పంపితే బిల్లులు రావని హెచ్చరిక

- ఇప్పటికే మిల్లులకు తరలిపోయిన జిల్లాలోని రైతుల ధాన్యం

- నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి వేడుకోలు

అన్నదాతలు నిబంధనల చట్రంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పండించిన ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి రాకతో కుప్ప నూర్పిళ్లు ముమ్మరం చేసిన రైతులు ధాన్యం ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ చేయలేక స్థానిక మిల్లులకు తరలించారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు నిబంధనల బాంబు పేల్చారు. జీపీఎస్‌ ఉన్న వాహనాల్లోనే ధాన్యం తరలించాలని, ముందుగా ధాన్యం మిల్లులకు పంపితే బిల్లులు రావంటూ స్పష్టం చేశారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిబంధనలు సడలించాలని వేడుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలోని రైతుల వద్ద ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన 1.50 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఏటా వలే ప్రభుత్వం ఇటీవల ఖరీఫ్‌ సీజన్‌లో మిగులు ధాన్యం 40 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం మరో 10 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొంత మేర అయినా ధాన్యం అమ్మకానికి అవకాశం వచ్చిందని రైతులు సంబరపడ్డారు. కానీ ఈ లోగానే పౌరసరఫరాల సంస్థ అధికారులు ధాన్యం కొనుగోలుపై నిబంధనలు విధించారంటూ మిల్లర్లు, రైతు సేవా కేంద్రాలకు విధివిధానాలను పంపించారు. నాలుగురోజుల క్రితమే ఏ మిల్లు ఎంత ధాన్యం కొనుగోలు చేయాలనే అంశంపై లక్ష్యాలు విధించారు. కానీ ధాన్యం మిల్లులకు పంపకుండా నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారు.

నిబంధనలు ఇవీ

జిల్లాలోని రైస్‌ మిల్లులు, ఆర్‌ఎస్‌కేలకు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విధి విధానాలను రెండు రోజుల క్రితం పంపారు.

-ఖరీఫ్‌ సీజన్‌ 2024-25 సంవత్సరానికి సంబంధించి మిగులుబాటు ధాన్యం కొనుగోలు చేసేందుకు రైస్‌ మిల్లుల నుంచి మార్కింగ్‌ చేసిన సంచులనే వాడాలి.

-జీపీఎస్‌ సౌకర్యం ఉన్న వాహనాలను రిజిస్ర్టేషన్‌ చేసుకుని వాటిలోనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి.

-మిల్లులకు ముందుగానే ధాన్యం పంపి ఆ తర్వాత ఆన్‌లైన్‌ చేయడం పూర్తిగా నిషేధం.

-మిల్లుల వద్ద జీపీఎస్‌ వాహనం ఉంచి ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేయకూడదు.

- జీపీఎస్‌ వాహనాలను ధాన్యం కల్లాలు, రైతు సేవా కేంద్రాల వద్ద ఉంచి ఆన్‌లైన్‌లో ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేసిన తర్వాతే ధాన్యం మిల్లులకు తరలించాలి. ఈ సమయంలో అక్కడి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

- జీపీఎస్‌ సౌకర్యం ఉన్న వాహనాల్లో ధాన్యం లేకుండా మిల్లుల వద్ద ఉంచి ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేస్తే జీపీఎస్‌ నమోదు కాదు. ఇలా చేస్తే రైతుల ధాన్యం బిల్లులు, వాహనాల రవాణా చార్జీలు చెల్లించరు. అదే సమయంలో రైస్‌ మిల్లులకు ధాన్యం మరపట్టిన బిల్లులను నిలిపివేయడం, సదరు మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.

వాస్తవ పరిస్థితి ఇదీ

వేసవికాలం కావడంతో రైతులు ఇప్పటికే కుప్పనూర్పిళ్లు పూర్తిచేశారు. ధాన్యం మిల్లులకు తరలించారు. గుడ్లవల్లేరు, పెడన, మోపిదేవి, మచిలీపట్నం, మొవ్వ, పామర్రు, ఘంటసాల తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. కుప్పనూర్పిడి అనంతరం పొలంలో రోజుల తరబడి ధాన్యం ఉంచితే భద్రత లేకపోవడంతోపాటు, వర్షం కురిస్తే తడుస్తాయనే భయంతో రైతులు ధాన్యం మిల్లులకు తరలించారు. దీంతో పాటు బయటి ప్రాంతాల మిల్లులకు, వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర బస్తాకు రూ.1,725లకు బదులుగా వంద రూపాయలు ధర తగ్గించి రూ.1,612లకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు స్థానిక మిల్లర్లతో ఉన్న అనుబంధంతో అక్కడికి తరలించారు. ఇంతా జరిగాక పౌరసరఫరాలసంస్థ అధికారులు ఇప్పుడు ధాన్యం కొనుగోలులో తాము సూచించిన నిబంధనలన్నీ పాటించాలనే షరతులు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా ఒకటీ రెండు చోట్ల ధాన్యం కొనుగోలులో తప్పులు దొర్లుతాయని, వాటిని ఆధారంగా చేసుకుని జిల్లాలోని రైతులందరినీ ఇబ్బందులు పెట్టడం సరికాదంటున్నారు. అధికారులు వెంటనే నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:32 AM