Waqf Bill Row CPI Narayana Fires on Centre: దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదా
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:33 AM
వక్ఫ్ బిల్లు ఆమోదం దేశ లౌకిక వ్యవస్థకు చీకటి రోజు అని సీపీఐ నేత నారాయణ అన్నారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం గిరిజనులపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు
వక్ఫ్ బిల్లు ఆమోదం లౌకిక వ్యవస్థకు చీకటి రోజు: సీపీఐ నారాయణ
తిరుపతి ఆటోనగర్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలో భాగమే నక్సలైట్ల ఏరివేత అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాలపై మోదీ ప్రభుత్వం గురిపెట్టిందన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నక్సలిజం భావజాలంపై పోరాటం తప్పుకాదు. ఆ సాకుతో మనుషులను కాల్చిచంపడం సరైంది కాదు. 2026 కల్లా నక్సలైట్లను ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంలో అర్థమేమిటి?’ అని నారాయణ ప్రశ్నించారు. దేశంలో ఒకే ఆలోచన ఉండాలా.. భిన్నాభిప్రాయాలు ఉండకూడదా? అని నిలదీశారు. వక్ఫ్ బిల్లు కంటే, ఆ భూములపైనే బీజేపీ నాయకుల దృష్టి ఎక్కువగా ఉందని ఆరోపించారు. వక్ఫ్ భూములనూ కార్పొరేట్లకు అప్పగించడానికే బిల్లు తెచ్చారన్నారు. ఆ బిల్లు పాస్ చేయడమంటే దేశంలో లౌకిక వ్యవస్థకు చీకటి రోజు వచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు.