Share News

Agriculture Subsidy: సాగు పనిముట్ల పంపిణీలో తీవ్ర జాప్యం

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:24 AM

రైతులకు 40-50% రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా, వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసిన 13వేల మందిలో సగానికి పైగా రైతులకు పరికరాలు అందకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులపై అసహనం వ్యక్తమవుతోంది.

Agriculture Subsidy: సాగు పనిముట్ల పంపిణీలో తీవ్ర జాప్యం

పథకం అమలులో వెనుకబడ్డ 22 జిల్లాలు

అధికారులపై అగ్రి డైరెక్టర్‌ డిల్లీరావు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్లూ రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 40-50 శాతం రాయితీపై రైతులకు అందించాలని సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు నిర్ధేశించారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఈ పథకం అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తు చేసిన రైతులకు పరికరాలు అందించడంలో తాత్సారం చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 42వేల వ్యక్తిగత పనిముట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం గత నెలాఖరు వరకు దాదాపు 20వేల మంది రైతుల దరఖాస్తు చేశారు. అందులో 13వేల మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. ఇంత వరకు సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.28 కోట్లు విడుదల చేసింది. వీరందరికీ పరికరాలు అందాల్సి ఉండగా, ఇప్పటి వరకు సగం మందికి కూడా అందించలేదు. అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాలు మాత్రమే రాష్ట్రసరాసరి 54ులక్ష్యం దాటాయి. మిగతా 22 జిల్లాలు లక్ష్యసాధనలో పూర్తిగా వెనుకబడ్డాయి. దీనిపై వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు సోమవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలు కూడా వెనుకబడటంపై అధికారులను ఆయన వివరణ కోరారు. లోపం ఏస్థాయిలో ఉందో గుర్తించాలని, పాలనాపరమైన ఇబ్బందులేమిటో వ్యవసాయ, ఆగ్రోస్‌ అధికారులు లోతుగా విశ్లేషించి, రైతులకు సత్వరమే రాయితీ పరికరాలు అందించాలని ఆదేశించారు. కాగా రాయితీ పరికరాలకు పేర్లు నమోదు చేయాలన్నా, కంపెనీల నుంచి పనిముట్లు తెప్పించాలన్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది రైతుల నుంచి ముడుపులు కోరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మండల స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఎవరికీ అందించకుండా తాత్సారం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

Updated Date - Apr 22 , 2025 | 05:24 AM