Share News

Vizag Railway Zone: మన జోన్‌పై రైల్వే రివర్స్‌..

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:05 AM

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆలస్యం కావడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఒడిశా అధికారులు, రాజకీయాలు కారణంగా కార్యాచరణకు రైల్వేశాఖ వెనుకడుగు వేస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి.

Vizag Railway Zone: మన జోన్‌పై రైల్వే రివర్స్‌..

ముందు ఆపరేషన్లు.. ఆ తర్వాత నిర్మాణాలు

జోన్ల విషయంలో రైల్వేశాఖ విధానమిదే

రాయగడ కొత్త డివిజన్‌లోనూ ఇదే ప్రక్రియ

కానీ, విశాఖలో మాత్రం భిన్న వైఖరి

ఆపరేషన్స్‌ ప్రారంభంలో చిత్తశుద్ధి లోపం

ఒడిశా లాబీయింగ్‌ పనేనని అనుమానాలు

రైల్వే మంత్రి కూడా అక్కడివారే

జోన్‌ శంకుస్థాపనకూ అశ్వినీ వైష్ణవ్‌ దూరం

ఎంపీలు గట్టిగా అడగలేకపోవడం వల్లేనా?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్‌ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడ కూడా ఇలా జరగలేదు. ముందు కార్యకలాపాలు మొదలుపెట్టి ఆ తరువాత భూమిని సేకరించి నిర్మాణాలు చేపట్టారు. కానీ, ఇక్కడ మాత్రం ముందు నిర్మాణాలు.. ఆపైనే ఆపరేషన్లు అని రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్‌ అధికారులు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. విశాఖలో జోన్‌ ఆపరేషన్లు మొదలుకాకుండా వారే అడ్డం పడుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు వచ్చాయి. వీటిని ముందు అద్దె భవనాల్లో ప్రారంభించి...ఆ తరువాత నిర్మాణాలు పూర్తి చేసి, వాటిలోకి తరలించారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ను కూడా అలాగే చేశారు. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉన్న విధానం. అంత ఎందుకు..? ఏపీకి రాజధాని నగరం లేకుండానే తెలంగాణ నుంచి తరలివచ్చేశారు.

g.jpg

ఇప్పుడు ఓ వైపు పరిపాలన సాగిస్తూ మరోవైపు అమరావతి నిర్మాణం చేపడుతున్నారు. ఇంత చిన్న లాజిక్‌ కేంద్రం ఎందుకు మిస్‌ అయ్యారో మరి! మరోవైపు రైల్వే మంత్రిని నిలదీసి వెంటనే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ఎంపీలు అడగలేకపోతున్నారు.


జోన్‌ ఆపరేషన్‌ విషయంలో జాప్యానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్‌, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్‌గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్‌లోనే ఉంది. ఇది ఒక్క విశాఖపట్నం ప్రజలకు పరిమితం కాదు. రాష్ట్రం అంతటికీ సేవలు అందిస్తుంది. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్‌ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. అలా జరగాలంటే, ముందు జోన్‌ ఆపరేషన్లు మొదలు కావాలి. రైల్వేజోన్‌కు జనరల్‌ మేనేజర్‌ ప్రధాన అధికారి. ఆయనను తక్షణమే నియమించి విశాఖపట్నం పంపిస్తే ఆపరేషన్లు మొదలవుతాయి. పనులన్నీ ఒక క్రమపద్ధతిలో, వేగంగా పూర్తవుతాయి.

రాయగడ డివిజన్‌లో మొదలైన ఆపరేషన్‌

కొత్త జోన్‌లో భాగంగా వాల్తేరు డివిజన్‌ నుంచి విడదీసిన ప్రాంతాలతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటుచేశారు. ఇది భువనేశ్వర్‌ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా జోన్‌ పరిధిలోకి వస్తుంది. ఇది రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అడ్డా కావడంతో (ఒడిశా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం) డివిజన్‌ ప్రకటించిన వెంటనే దానికి డివిజన్‌ రైల్వే మేనేజర్‌ని నియమించారు. భూసేకరణ, భవన నిర్మాణం లేకుండానే ఆపరేషన్‌ ప్రారంభించారు. అదే చొరవ విశాఖలోని జోన్‌ విషయంలో చూపించడం లేదు.


జోన్‌ శంకుస్థాపన సంబరాలు ఏవీ?

విశాఖలో ఈ ఏడాది జనవరి 8న కొత్త జోన్‌ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు రైల్వే మంత్రి తప్పనిసరిగా హాజరవుతారు. కానీ విశాఖకు ఆ రోజు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాలేదు. ఇక్కడ జోన్‌ ఏర్పాటు ఒడిశాకు నష్టమనే భావన వారిలో బలంగా ఉంది. దాంతో ముఖం చాటేశారు. ఎక్కడెక్కడి నుంచో రైల్వే ఉన్నతాధికారులు అంతా వచ్చారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైల్వే అధికారులు, ఉద్యోగులెవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. వాస్తవానికి కొత్త జోన్‌ శంకుస్థాపన అంటే అది పెద్ద సంబరంలా జరగాలి. కానీ ఆ సంతోషం ఎవరిలోనూ లేదు. ఇప్పటికీ అందరిలోనూ అనుమానాలే. ఇక్కడ జోన్‌ ఆపరేషన్లు ఇప్పట్లో మొదలవుతాయని ఎవరూ భావించడం లేదు. అంత బలంగా ఒడిశా అధికారులు లాబీయింగ్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

ఇవిగో భవనాలు...

రైల్వే జోన్‌ కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించడానికి విశాఖలో అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్‌ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా నాలుగు అంతస్థుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్థులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. ఇవి కాకుండా డీఆర్‌ఎం బంగ్లా పక్కన ప్రభుత్వ పాఠశాలను ఇటీవల ఖాళీ చేయించేశారు. సుమా రు రెండు ఎకరాల విస్తీర్ణంలో అందులో తరగతి గదులు ఉన్నాయి. వీటిని జోనల్‌ కార్యాలయం పూర్తయ్యేంతవరకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంతో మాట్లాడి తక్షణమే రైల్వే జోన్‌ ఆపరేషన్లు మొదలయ్యేలా చూడాలి. దీనికి అవసరమైన గజిట్‌ ప్రకటించేలా చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 07:35 AM