Share News

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:08 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడి గా మారింది.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
శ్రీమఠం ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడి గా మారింది. శుక్రవారం సెలవు దినం కావటంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

ఫ రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం చైత్ర మాస పంచమి శుభదినం సందర్భంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహా ుంగళహారతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.

మఠానికి రూ. లక్ష విరాళం

రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన గురాజు అనేభక్తుడు రూ.లక్ష విరాళం ఇచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు. శుక్రవారం కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని విరాళం ఇచ్చినట్లు తెలిపారు. దాత కుటుంబానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అనంతపురాణిక్‌, గిరిధర్‌, శ్రీపాధాచార్‌, జేపీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:08 AM