Share News

Dr. Gajula Ramakrishna: 58 ఏళ్ల వయసులో కార్డియాలజీ డిగ్రీ

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:15 AM

గుంటూరుకు చెందిన డాక్టర్‌ గాజుల రామకృష్ణ 58 సంవత్సరాల వయసులో కార్డియాలజీ (డీఎం) కోర్సు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఆయన ఇప్పుడు న్యూరాలజీ, కార్డియాలజీ కోర్సులు పూర్తి చేసిన ఏకైక డాక్టర్‌గా గుర్తింపు పొందారు.

Dr. Gajula Ramakrishna: 58 ఏళ్ల వయసులో కార్డియాలజీ డిగ్రీ

ప్రముఖ న్యూరాలజిస్ట్‌ రామకృష్ణ ఘనత

దేశంలో ఈ ఘనత సాధించిన తొలి వైద్యుడిగా గుర్తింపు

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించిన సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫలితాల్లో గుంటూరుకు చెందిన డాక్టర్‌ గాజుల రామకృష్ణ కార్డియాలజీ (డీఎం) కోర్సులో ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో కార్డియాలజీ డిగ్రీ సాధించిన వైద్యుడిగా ఆయన రికార్డు సృష్టించారు. చినకాకానిలోని ఎన్నారై వైద్య కళాశాలలో కార్డియాలజీ కోర్సు చేసిన ఆయన ఇకపై పూర్తిస్థాయిలో గుండె జబ్బుల వైద్య నిపుణుడిగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. అంతే కాదు.. రామకృష్ణ క్వాలిఫైడ్‌ న్యూరాలజిస్ట్‌ కూడా. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి న్యూరాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఇన్‌చార్జ్‌ విభాగాధిపతి హోదాలో విధులు నిర్వహిస్తూ.. నీట్‌ రాసిన ఆయన కార్డియాలజీ సీటు సాధించారు. భారత్‌లో న్యూరాలజీ, కార్డియాలజీ కోర్సులు చేసిన ఏకైక డాక్టర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలిలో జన్మించిన డాక్టర్‌ రామకృష్ణ 1986-92 మధ్య ఎంబీబీఎస్‌ చదివారు. అనంతరం 1998వ బ్యాచ్‌లో పల్మనాలజీ పీజీ కోర్సు, 2004వ బ్యాచ్‌లో జనరల్‌ మెడిసిన్‌ పీజీ కోర్సులు చేశారు. తిరుపతి స్విమ్స్‌లో 2011-14 మధ్య న్యూరాలజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేశారు. కాగా, గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కార్డియాలజీ, న్యూరాలజీ డిగ్రీలు చేసిన ఏకైక డాక్టర్‌గా గుర్తింపు దక్కడం పట్ల చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గుండె, నరాలు, ఊపిరితిత్తులకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంటుందని, ఈ మూడు కోర్సులు చేయడం వల్ల రోగుల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగ్గా అంచనా వేసి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని రామకృష్ణ తెలిపారు.

న్యూరాలజీలో టాపర్‌ కార్తీక్‌ రెడ్డి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించిన న్యూరాలజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా గుంటూరు వైద్య కళాశాల (జీఎంసీ) విద్యార్థి డాక్టర్‌ కార్తీక్‌ రెడ్డి నిలిచారు. 800 మార్కులకు గాను ఆయన 649 మార్కులు (82 శాతం) సాధించారు. రాష్ట్రంలో మొదటి మూడు ర్యాంకులు కూడా జీఎంసీ విద్యార్థులకే దక్కాయి. డాక్టర్‌ అజ్మ 626 మార్కులతో రెండో ర్యాంకు, డాక్టర్‌ కాంతిమ 625 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. స్టేట్‌ ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులను జీఎంసీ ప్రిన్సిపాల్‌, న్యూరాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి అభినందించారు.

Updated Date - Apr 22 , 2025 | 05:16 AM