Share News

సెలవుల్లోనూ.. చదువుల బాధలు!

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:25 AM

కార్పొరేట్‌ కళాశాలల నిర్వాకంతో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు చదువుల బాధలు తప్పడంలేదు. జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకుల పేరుతో సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. ప్రత్యేక కోర్సుల పేరిట తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఎవరైనా వేసవి సెలవులు కదా అంటే మీకు ర్యాంకులు రావాలా.. వద్దా అంటూ కరకుగా సమాధానం చెబుతున్నారు. బస్సులు నడపం.. మీరే ఎక్కించుకురావాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సెలవుల్లోనూ.. చదువుల బాధలు!

- కార్పొరేట్‌ కళాశాలల నిర్వాకం

- వేసవి సెలవుల్లోనూ విద్యార్థులు రావాల్సిందేనని హుకుం

- జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకుల పేరిట చితికిపోతున్న బాల్యం

- సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ!

- ప్రత్యేక కోర్సుల పేరిట అధిక ఫీజులు

- రవాణా విషయంలో మాత్రం శ్రద్ధ వహించని కాలేజీలు

- చిన్న వయస్సులోనే డిప్రెషన్‌, ఆరోగ్య సమస్యలు

కార్పొరేట్‌ కళాశాలల నిర్వాకంతో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు చదువుల బాధలు తప్పడంలేదు. జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకుల పేరుతో సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. ప్రత్యేక కోర్సుల పేరిట తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఎవరైనా వేసవి సెలవులు కదా అంటే మీకు ర్యాంకులు రావాలా.. వద్దా అంటూ కరకుగా సమాధానం చెబుతున్నారు. బస్సులు నడపం.. మీరే ఎక్కించుకురావాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 170 వరకు కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మొగల్రాజపురంలోని 47 కళాశాలలు, బెంజ్‌సర్కిల్‌లోని 20 కళాశాలలు, రామవర ప్పాడు ఏరియాలోని మరో 13 కళాశాలల్లో వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్‌ విద్యార్థులపై ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు రోజురోజుకు చదువు ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు పూర్తయి మూడు వారాలు కూడా గడవకముందే ద్వితీయ సంవత్సరం మార్కుల టార్గెట్‌ అంటూ తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు కొన్నేళ్ల కిందట వరకు ప్రత్యేక తరగతులు పెట్టేవారు. ప్రస్తుతం కాలానికనుగుణంగా ప్రథమ సంవత్సరం పూర్తి కాగానే ద్వితీయ సంవత్సర తరగతులతో పాటు, జేఈఈ, ఎంసెట్‌ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగర పరిధిలోని అనేక ప్రైవేటు కాలేజీలు ఇంటర్‌ మొదటి ఏడాది ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు రెండవ ఏడాదికి ప్రత్యేక తరగతులను ప్రారంభించాయి. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎక్కువ మార్కుల సాధించిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని తరగతులకు వచ్చేలా యాజమాన్యాలు పథకాలు రచిస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఫీజుల రాయితీ, ఎవరికో వచ్చిన ర్యాంకులను కాలేజీ ఖాతాలో చూపించి వారిని మభ్యపెడుతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు సాఽధారణ రోజుల్లాగే వేసవి సెలవుల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో వేసవి సెలవుల్లో అయినా చదువుల ఒత్తిడి నుంచి బయటపడాలని భావించిన అనేక మంది విద్యార్థులకు మానసిక ఒత్తిడితో కూడిన ఇబ్బందులు తప్పడం లేదు. అనేక కాలేజీలు రాత్రి వరకు ప్రత్యేక తరగతులను నిర్వహించడం గమనార్హం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకారాన్ని అందిస్తుండటంతో విద్యార్థులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.

వేసవి టూర్లు, సరదాలు మాయం

వేసవి సెలవులు వచ్చాయి అనగానే విద్యార్థులు అమ్మమ్మ వాళ్ల ఇంటికో, కుటుంబంతో వేసవి విడిదికో వెళ్తారనే ఆలోచన సెలవులకు ముందే వారి మనసులో నాటుకుపోయేది. కానీ ఇది ఒకప్పటి మాట. వేసవి సెలవులు అనేవి చరిత్రగా చెప్పుకునే పరిస్థితికి నేటి తరం విద్యార్థులు వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ, ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే కోచింగ్‌ పేరుతో క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇటువంటి విద్యావిధానంతో పిల్లలు తల్లిదండ్రులు, బంధువుల దగ్గర గడపాల్సిన సమయంతో పాటు, ఆట పాటలకు దూరమవుతున్నారు. దీంతో పిల్లలు అనురాగాలు, ఆప్యాయతలకు దూరమై కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే మానసిక ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులకు మానసిక ఉత్సాహంగా ఉంటేనే వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా నేటి విద్యావ్యవస్థ తయారయింది. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వత్తాసు పలకడంతో కార్పొరేట్‌ విద్యా సంస్థల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రుల ఆలోచన దృక్పథం మారాలి

భాష, వేషధారణ, విహార వినోదాల పేరుతో పాశ్చాత్య పోకడలను అనుసరిస్తున్న నేటి తరం తల్లిదండ్రులు ఆయా దేశాల్లో పిల్లలకు చదువు, కెరీర్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి స్వేచ్ఛనిస్తున్నారో అనే విషయంలో మాత్రం ఆ విధంగా ఆలోచించడం లేదు. పాశ్చాత్య దేశాలలో పిల్లలకు కనీస వయస్సు వస్తే వారి సొంత ఆలోచనలకు విలువనిస్తారు. కానీ మన దేశంలో ముప్పై ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చెప్పినట్టే నడుచుకోవాలి. వారు చెప్పిన కోర్సులే చదవాలి, వారు చెప్పిన ఆటలే ఆడాలి. మరి అలాంటప్పుడు పిల్లలు పనికిరాలేదంటే ఎలా? పిల్లలకు నచ్చిన రంగంలోకి అడుగులేసే స్వేచ్ఛనిచ్చినప్పుడే కదా.. వారి లోటుపాట్లు గురించి ప్రశ్నించే హక్కు ఉండేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇతరులతో పోలికలు మానుకుని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అనుకున్న విజయాలు సాధించడానికి దోహపడేవారవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై నేటి తరం తల్లిదండ్రులు కచ్ఛితంగా ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Apr 24 , 2025 | 01:25 AM