Share News

Parvathipuram ACB raid: ఏసీబీ వలలో మన్యం జిల్లా మత్స్యశాఖ అధికారి

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:09 AM

పార్వతీపురం మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య రూ.60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పూర్తి బిల్లుల చెల్లింపుకు లంచం డిమాండ్‌ చేసిన తిరుపతయ్యను అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

Parvathipuram ACB raid: ఏసీబీ వలలో మన్యం జిల్లా మత్స్యశాఖ అధికారి

రూ.60 వేలు తీసుకుంటుండగా పట్టివేత

పార్వతీపురం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. చేప పిల్లల బిల్లు చెల్లించేందుకు బాధితుడి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎ్‌సఎస్‌ రమణమూర్తి కథనం మేరకు.. పాలకొండ మండలం టీడీ పారాపురానికి చెందిన కోటదుర్గ గిరిజన ఫిష్‌ సీడ్‌ సంస్థ యజమాని బొప్పన అప్పన్నదొర పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజన మత్స్యకారులకు, జిల్లాలోని చెరువులకు చేప పిల్లలను సరఫరా చేశారు. దీనికి సంబంధించి ఆయనకు రూ.60 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలంటే రూ.60 వేలు లంచం ఇవ్వాలని జిల్లా మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య డిమాండ్‌ చేశారు. దీంతో అప్పన్నదొర ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం రూ.60 వేలు తిరుపతయ్యకు అందజేశారు. ఆ నగదు తిరుపతయ్య తన టేబుల్‌ లోపల పెడుతుండగా విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, ఎస్‌ఐ వాసునారాయణ, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. తిరుపతయ్యను గురువారం విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:09 AM