Share News

Public Money Misuse: సారు.. దోచిపెట్టారు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:51 AM

జగన్‌ పత్రిక మార్కెటింగ్‌ బాధ్యతలు కూడా విజయ్‌ కుమార్‌ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెలనెలా 200 రూపాయలు విడుదల చేశారు.

Public Money Misuse: సారు.. దోచిపెట్టారు

  • జగన్‌ పత్రికకు 574 కోట్లు సమర్పయామి.. నిగ్గుతేల్చిన విజిలెన్స్‌

  • ఐదేళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు

  • ఇందులో రోత మీడియాకే 371 కోట్లు

  • పత్రిక కొనుగోలు ద్వారా మరో 203 కోట్లు

  • వలంటీర్లు, ఉద్యోగులకు చందాతో మళ్లింపు

  • విజిలెన్స్‌ విచారణలో అక్రమాలు వెలుగులోకి

  • అడ్డంగా దొరికిన నాటి సమాచార కమిషనర్‌

  • విజయ్‌కుమార్‌పై ఏసీబీ కేసు.. విచారణకు పిలుపు

  • కేంద్ర సర్వీసులోని ఐఐఎ్‌సకు చెందిన తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో 2019-2024 మధ్య రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్‌ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలన్న కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్‌ రోత పత్రికకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు.

  • గత ఐదేళ్లలో ప్రచారానికి ప్రకటనల రూపంలో జగన్‌ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.859 కోట్లు. ఇందులో అత్యధికంగా 43 శాతం (రూ.371 కోట్లు) జగన్‌ మీడియాకే సమర్పించేశారు.

సాక్షి కొనుగోలుకు 203 కోట్లు

జగన్‌ పత్రిక మార్కెటింగ్‌ బాధ్యతలు కూడా విజయ్‌ కుమార్‌ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెలనెలా 200 రూపాయలు విడుదల చేశారు. వలంటీర్లకు ఇలా మొత్తం రూ.143.64 కోట్లు ఇచ్చారు. అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో రూ.59.42 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్మంతా జగన్‌ పత్రికకు చేరింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత జగన్‌ ప్రభుత్వంలో ఏ వనరులూ, మార్గాలూ వదలకుండా దోచుకున్నారు. మద్యం, ఇసుక, గనుల్లో వేల కోట్లు దోపిడీ చేసినట్టు ఆరోపణలు రాగా, జగన్‌ పత్రికకు ప్రజల సొమ్ము వందల కోట్లు పంచిపెట్టారు. ప్రకటనల రూపంలో రూ.371 కోట్లు, పత్రిక కొనుగోలుకు చందా కింద మరో 203 కోట్లు సమర్పించినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది. దోచిపెట్టడంలో కీలక సూత్రధారి నాటి సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి. నిబంధనలు ఉల్లంఘించి మరీ అయాచిత లబ్ధి చేకూర్చినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది.


సమాచార శాఖను అడ్డు పెట్టుకుని జగన్‌ మీడియా సాగించిన విచ్చలవిడి దోపిడీ బట్టబయలైంది. అడ్డగోలుగా వ్యవహరించిన విజయ్‌కుమార్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్లు సాగించిన దోపిడీపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో అవినీతి వ్యవహారాలు ముడిపడి ఉండటంతో ఆ కేసును ఏసీబీ విచారించనుంది. విజయ్‌కుమార్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి, విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసు జారీ చేసింది.

తీవ్ర ఆరోపణలు: గత ప్రభుత్వంలో ప్రకటనల జారీ విషయంలో సమాచారశాఖ కమిషనర్‌గా విజయ్‌కుమార్‌ రెడ్డి పత్రికల సర్కులేషన్‌ను పట్టించుకోలేదు. టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు. పథకాల పేరిట జగన్‌ బటన్‌ నొక్కిన ప్రతిసారి ఆయన భార్య భారతి యజమానిగా ఉన్న సొంత మీడియాకు ప్రకటన రూపంలో కోట్లాది రూపాయలు కుమ్మరించారు. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వైసీపీ సోషల్‌ మీడియాకు హెడ్‌గా వ్యవహరించిన గుర్రంపాటి దేవేందర్‌రెడ్డికి రూ.కోట్లు చెల్లించేశారు. ఈ బాగోతంపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ విచారణకు కూటమి సర్కార్‌ ఆదేశించింది. ఐ అండ్‌ పీఆర్‌ మాజీ కమిషనర్‌ అవినీతి, అక్రమాలు, ఉల్లంఘనలపై విజిలెన్స్‌ అధికారులు కూపీ లాగారు. జగన్‌ పత్రిక, టీవీకి దోచిపెట్టిన వైనంతో పాటు ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలకు ఏ విధంగా అన్యాయం చేశారో తేల్చింది. రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆగస్టులో ప్రాథమిక నివేదిక, జనవరి 22న పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.


ఎవరీ విజయ్‌కుమార్‌ రెడ్డి?

తెలంగాణకు చెందిన తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర సర్వీసులోని ఐఐఎస్‌ అధికారి. సర్వీసులో ఎక్కువకాలం ఢిల్లీలో పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడే జగన్‌ పత్రికకు ఖజానా నుంచి ప్రజల సొమ్ము దోచిపెట్టేలా డీల్‌ కుదిరింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఆయన డిప్యుటేషన్‌పై వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ సమాచారశాఖ కమిషనర్‌గా పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా జగన్‌ మీడియాకు భారీగా దోచిపెట్టారు. కూటమి ప్రభుత్వంలో తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతో మళ్లీ మాతృసంస్థ (ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో)కు వెళ్లిపోయారు. ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారు.

ఔట్‌ డోర్‌ ప్రకటనల్లోనూ అక్రమాలు

వైసీపీ హయాంలో ఔట్‌ డోర్‌ ప్రకటనల విషయంలోనూ భారీగా అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ నివేదికలో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ విజయవాడకు చెందిన ప్రకాశ్‌ ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వలయం క్రియేషన్స్‌, ఆర్‌ఎం అసోసియేట్స్‌కు 61ు బిల్లులు మంజూరు చేసినట్లు గుర్తించింది. సాక్షి గ్రూప్‌, వైసీపీ మీడియా సెల్‌కు చెందినవారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో చూపించి జీతాలు చెల్లించినట్లు వెల్లడించింది.

పీఆర్‌వోలుగా సాక్షి ఉద్యోగులు

జగన్‌ సొంత మీడియాలో పనిచేసిన 142 మందిని నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ పేరుతో పీఆర్‌వోలుగా తీసుకున్నట్లు విజిలెన్స్‌ తేల్చింది. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లుగా 50మందిని ఐ అండ్‌ పీఆర్‌ నియమించుకుంది. జగన్‌ పార్టీ సోషల్‌ మీడియా హెడ్‌గా వ్యవహరించిన దేవేందర్‌ రెడ్డికి డిజిటల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇచ్చి, రూ.2.63కోట్ల వేతనం చెల్లించారు. మరో 113మంది వైసీపీ, సాక్షిబ్యాచ్‌కు ప్రజల సొమ్ము జీతంగా చెల్లించారు. కంటెంట్‌డెవలపర్స్‌, సోషల్‌ మీడియా అనలిస్టులు, డిజిటల్‌ క్యాంపెయినర్లు పోస్టులను ఆప్కోస్‌ ద్వారా భర్తీచేసి వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పెద్దపీట వేశారు. ఈ నియామకాల్లో నిబంధనలు పాటించకుండా అన్నీ బ్యాక్‌డోర్‌ ద్వారా చేపట్టారు.


ఆంధ్రజ్యోతి, ఈనాడుపై తప్పుడు కేసులు

గత ప్రభుత్వ పాలనలో తప్పులు ఎత్తి చూపుతూ వార్తలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడుపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించినట్లు విజిలెన్స్‌ తేల్చింది. 2019లో 2430 జీవో తీసుకొచ్చి మీడియా సంస్థలతోపాటు పాత్రికేయులపై ప్రభుత్వ ప్రతినిధులు నేరపూరిత పరువు నష్టం కేసులు నమోదు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు ఇచ్చినట్లు వివరించింది. జగన్‌ ప్రభుత్వంలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడుపై 16తప్పుడు కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. అడుగడుగునా అక్రమాలకు పాల్పడిన విజయ్‌ కుమార్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజయ్‌కుమార్‌ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. విచారణకు రావాలని నోటీసు పంపింది.

నివేదికలోని కీలకాంశాలు

  • జగన్‌ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియాకు ప్రకటనల రూపంలో కోట్లు కుమ్మరించారు. ఇతర పత్రికలను విస్మరించారు.

  • ప్రకటనల విషయంలో విజయ్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రజ్యోతికి పూర్తిగా, ఈనాడుకు పాక్షికంగా అన్యాయం చేశారు.

  • రాష్ట్రంలో అత్యధిక సర్కులేషన్‌ గల ఈనాడుకు రూ243కోట్ల ప్రకటనలు జారీ చేశారు. రెండోస్థానంలో ఉన్న జగన్‌ మీడియాకు ఏకంగా రూ.371 కోట్ల ప్రకటనలు ఇవ్వడం దోపిడీకి నిదర్శనం.

  • గత ఐదేళ్లలో ఆంధ్రజ్యోతికి జారీ చేసిన ప్రకటనల విలువ కేవలం రూ.27 లక్షలు. ఇదే సమయంలో ప్రకటనల కోసం చేసిన ఖర్చులో జగన్‌ మీడియాకు 43ు, ఈనాడు 28ు, ఆంధ్రజ్యోతికి 0.03ు ఇచ్చారు.

  • ఆంధ్రప్రభకు రూ.16.50కోట్లు, వార్తకు 15 కోట్లు, ప్రజాశక్తికి రూ.13.28 కోట్లు, విశాలాంధ్రకు రూ.2 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఆంగ్ల పత్రికల్లో ది హిందూ, డెక్కన్‌ క్రానికల్‌కు కలిపి మొత్తం రూ.98 కోట్లు విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి.

  • అత్యధిక సర్కులేషన్‌ ఉన్న ఈనాడు ప్రకటనల ధరలు పెంచబోమంటూ 2019లో తిరస్కరించిన సమాచార శాఖ... సాక్షికి మాత్రం 60 శాతం అధికంగా పెంచింది.

  • సుప్రీం మార్గదర్శకాలుపాటిస్తూ రాజకీయ పార్టీలకు అనుకూల పత్రికలు, మీడియా కు ప్రభుత్వ నిధులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ పేర్కొంది.

Updated Date - Mar 21 , 2025 | 03:51 AM