పెట్టుబడికి రెట్టింపు అంటూ రూ.కోట్లతో పరార్!
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:41 AM
ప్రజల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాంకేతిక రంగాన్ని ఎంచుకున్నాడు. ఒక వీడియోను ఎన్ని మార్పులతో అయినా అద్భుతంగా మలచగలిగే యానిమేషన్ పేరు సంస్థకు పెట్టుకున్నాడు. ఆ పేరును ఉపయోగించుకుని రెట్టింపు లాభాలు ఇస్తానని అందర్నీ నమ్మించాడు. వారు పెట్టిన పెట్టుబడితో సొంత ఆస్తులు సమకూర్చుకున్నాడు. తిరిగి చెల్లింపులు చేయాల్సి రావడంతో ఇప్పుడు ముఖం చాటేసి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఇదీ విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ వ్యవహారం.
నగరంలో యూపిక్స్ ‘మాయ’!
రెట్టింపు లాభాల పేరుతో ప్రజలకు ఎర
వచ్చిన పెట్టుబడులతో ఆస్తుల కొనుగోలు
జనవరి నుంచి చెల్లింపులు నిలిపివేత
కార్యాలయానికి తాళం.. అజ్ఞాతంలోకి వ్యవస్థాపకుడు కిరణ్
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ప్రజల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాంకేతిక రంగాన్ని ఎంచుకున్నాడు. ఒక వీడియోను ఎన్ని మార్పులతో అయినా అద్భుతంగా మలచగలిగే యానిమేషన్ పేరు సంస్థకు పెట్టుకున్నాడు. ఆ పేరును ఉపయోగించుకుని రెట్టింపు లాభాలు ఇస్తానని అందర్నీ నమ్మించాడు. వారు పెట్టిన పెట్టుబడితో సొంత ఆస్తులు సమకూర్చుకున్నాడు. తిరిగి చెల్లింపులు చేయాల్సి రావడంతో ఇప్పుడు ముఖం చాటేసి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఇదీ విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ వ్యవహారం.
(ఆంఽధ్రజ్యోతి, విజయవాడ)
విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ సత్యనారాయణపురంలో కొద్దినెలల క్రితం యూపిక్స్ యానిమేషన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇక్కడి నుంచి కార్యకలాపాలను రాష్ట్రమంతటా విస్తరించాడు. తన సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఆరు నెలల్లో రూ.2లక్షలు తిరిగి చెల్లిస్తానని ప్రకటనలు గుప్పించాడు. ఇలా మార్కెటింగ్ చేసుకుని పెట్టుబడులు రావడం మొదలయ్యాక అసలు స్కెచ్‌ను అమలు చేశాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు చేసిన ప్రకటనలను ఆదర్శంగా తీసుకుని పెట్టుబడికి రెట్టింపు లాభాలు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దీని మాయలోపడి రూ.లక్షల్లో కొందరు, కోట్లలో మరికొందరు పెట్టుబడులు పెట్టారు. తర్వాత నెమ్మదిగా జనవరి నుంచి చెల్లింపులు ఆపేశాడు. సరిగ్గా ఏప్రిల్ నెల వచ్చే సరికి సత్యనారాయణపురంలో ఉన్న కార్యాలయానికి తాళాలు వేశాడు. నిడుమోలు కిరణ్ తమను నిండా ముంచేశాడని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు.
మళ్లీ వంచనకు సెల్ఫీ వీడియోతో స్కెచ్!
నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో బాధితులను మరోసారి వంచించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇతర రాషా్ట్రలకు పారిపోయి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. కిరణ్ సుమారుగా రూ.10కోట్ల మేరకు ప్రజల నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డబ్బులను జమ చేయడానికి సత్యనారాయణపురంలోని యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన మూడు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయించుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు బాధితులు తమ డబ్బుల కోసం ఫోన్ చేసినా, సందేశాలు పంపినా స్పందించని కిరణ్ ఇప్పుడు నేరుగా సెల్ఫీ వీడియోలో ప్రత్యక్షమయ్యాడు. తాను ఇప్పటికీ సచ్చీలుడునేనని చెప్పుకొచ్చాడు. తన సమయమంతా ఫోన్లు చేసిన వారికి సమాధానాలు చెప్పడానికే సరిపోతుందని, తనకు ఇతర సంస్థల నుంచి డబ్బులు అందగానే అందరికీ చెల్లింపులు చేస్తానని వీడియోలో వివరించాడు. ఇక నుంచి పెట్టుబడిదారులతో నిత్యం పది నిమిషాలు మాట్లాడతానని భరోసా ఇచ్చాడు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో కిరణ్ తన ఇద్దరు సన్నిహితులతో రెండు వేర్వేరు కంపెనీలు ఏర్పాటు చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అరెస్టు చేసి కిరణ్‌ను జైలుకు పంపితే తమకు నయాపైసా రాదని భావించిన బాధితులు కొందరు ఇంకా అతడి మాయలోనే ఉన్నారు. సత్యనారాయణపురం పీఎస్‌లో ప్రస్తుతం ఇద్దరు బాధితులు మాత్రమే ఫిర్యాదు చేశారు. కిరణ్‌పై ఇప్పటికే గుంటూరు జిల్లాలో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో తన కుటుంబ సభ్యుల పేరున భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పోలీసులు దర్యాప్తులో ఏవిధంగా అడుగులు వేస్తున్నారన్న విషయాలను కిరణ్‌కు ఇక్కడి నుంచి ఇద్దరు, ముగ్గురు అనుచరులు చేరవేస్తున్నట్టు సమాచారం.