Share News

Liquor Scam: రాజ్‌ కసిరెడ్డికి రిమాండ్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:15 AM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి ఏసీబీ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఐటీ సలహాదారుగా ఉండి బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో భారీ అవినీతికి పాల్పడ్డారని సిట్‌ వాదించింది.

 Liquor Scam: రాజ్‌ కసిరెడ్డికి రిమాండ్‌

విజయవాడ జైలుకు తరలింపు.. హోరాహోరీగా వాదనలు

విజయవాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు 15 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆయనను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. సిట్‌ అధికారులు రాజ్‌ కసిరెడ్డికి మంగళవారం సాయంత్రం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి... ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్‌ రావు ముందు హాజరు పరిచారు. సిట్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కల్యాణి వాదనలు వినిపించారు. ‘‘రాజ్‌ కసిరెడ్డి ప్రతినెలా రూ.50 కోట్ల నుంచి 60 కోట్లు ముడుపులు తీసుకునేలా మద్యం పాలసీ రూపొందించారు. ఐదేళ్లలో రూ.3250 కోట్లు లిక్కర్‌ కంపెనీల నుంచి కమీషన్లు తీసుకున్నారు. పేరుకు ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నప్పటికీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో చక్రం తిప్పారు. అప్పుడు స్పెషలాఫీసర్‌గా ఉన్న సత్యప్రసాద్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి వాంగ్మూలాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. సత్యప్రసాద్‌ది ఈ రాష్ట్రం కానప్పటికీ... కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చి వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కేసులో 29 మంది నిందితులున్నారు. లోతుగా విచారణ జరగాలి’’ అని కోరారు. ఇక... కసిరెడ్డి తరఫున మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ‘సిట్‌’కు అసలు చట్టబద్ధతే లేదన్నారు. రాజ్‌ కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదని... ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం వర్తించదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం... మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజ్‌ కసిరెడ్డికి 6వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 05:15 AM