Lulu Group at Visakhapatnam: లులూకు లైన్ క్లియర్
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:55 AM
విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించేందుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2018లో టీడీపీ హయాంలో కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, తాజా ఉత్తర్వులతో APIIC భూములను తిరిగి పొందింది.

విశాఖలో ఇంటర్నేషనల్ మాల్
తాజాగా ఏపీఐఐసీకి ప్రతిపాదనలు
13.43 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని వీఎంఆర్‌డీఏకు ప్రభుత్వం ఆదేశం
గత టీడీపీ పాలనలోనే ఒప్పందం
తరువాత వైసీపీ హయాంలో రద్దు
విశాఖపట్నం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్టు చేపట్టేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. దీనిపై ఏపీఐఐసీకి ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ వద్ద ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లులూ గ్రూపునకు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంది. విశాఖపట్నంలో విలువైన భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న జగన్ ప్రభుత్వం వాటిని గజాల లెక్కన విక్రయిస్తామని ప్రకటింది. అయితే ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ తరువాత ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరుతో నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం వేయాలని ప్రయత్నించింది. దానిపై విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ భూములు విక్రయించవద్దని కోర్టు స్టే ఇచ్చింది. దాంతో జగన్ ప్రభుత్వం ఆ భూములు వీఎంఆర్‌డీఏకు బదలాయించి, ఆ సంస్థతో వేలం వేయించి సొమ్ము చేసుకోవాలని చూసింది. ఇదంతా 2024 ప్రారంభంలో జరగడం, ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ భూములన్నీ వీఎంఆర్‌డీఏ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తిరిగి ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాటి ప్రాజెక్టు విలువ 2,200 కోట్లు
హార్బర్ పార్కు ఏరియాలో ఏపీఐఐసీ చెందిన 10.85 ఎకరాలు, సీఎంఆర్ గ్రూపునకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాలులో 3.4 ఎకరాలు కలిపి లులూకు ఇచ్చారు. అందులో రూ.2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, అతి పెద్ద షాపింగ్ మాల్, 5 స్టార్ హోటల్ తదితరాలు నిర్మిస్తామని ప్రకటించింది. ఇది పీపీపీ ప్రాజెక్టు. దీనివల్ల ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నది అప్పటి అంచనా. సీఎంఆర్ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా నగరంలో పలుచోట్ల 4.85 ఎకరాలు ఇచ్చారు. అందులో వీఎంఆర్‌డీఏకి చెందిన 4.2 ఎకరాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..