Market Fee: మార్కెట్ ఫీజు వసూళ్లలో చేతివాటం!
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:18 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 2024-25లో ఆశించిన మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. చెక్‌పోస్టుల్లో సిబ్బంది చేతివాటంతో, పర్యవేక్షణలో లోపంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి.
పంట ఉత్పత్తులు, రవాణా బాగున్నా.. ఆదాయం అంతంతమాత్రమే!
అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే..
చెక్‌పోస్టుల్లో కనిపించని సీసీ కెమెరాలు
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): పంట ఉత్పత్తులు.. వాటి రవాణా బాగున్నా.. మార్కెట్ ఫీజులు మాత్రం ప్రభుత్వం ఆశించినట్టుగా రావడం లేదు. వసూళ్లలో ఏనాడూ లక్ష్యాన్ని చేరుకోలేదు. చెక్‌పోస్టుల సిబ్బంది చేతివాటమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. 2024-25లో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఫీజు వసూలు లక్ష్యం రూ.742.26 కోట్లు కాగా, ఇందులో రూ.696.58 కోట్లు (93.85 శాతం) వసూలైంది. గతేడాది పంట ఉత్పత్తులు మెరుగ్గా ఉన్నా.. క్రయవిక్రయాలు జోరుగా సాగినా.. అంచనా మేరకు మార్కెట్ ఫీజు రాలేదు. ఏటా పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాను పరిగణలోకి తీసుకుని, మార్కెట్ ఫీజులు నిర్ణయించి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. కానీ ఈ ఏడాది 218 ఏఎంసీల్లో 100 యార్డుల పరిధిలోని అధికారులు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. 118 ఏఎంసీల్లో 100ుపైన, 21ఏఎంసీల్లో 90-100ు, 54 ఏఎంసీల్లో 70-90ు, 21 ఏఎంసీల్లో 50-70ు వసూలయింది. రాష్ట్రంలో 453 మార్కెట్ కమిటీ చెక్ పోస్టులు ఉన్నాయి. పంట ఉత్పత్తులను రవాణా చేసేటప్పుడు ఎక్కడైనా ఒక చెక్‌పోస్టులో ఫీజు చెల్లిస్తే.. ఇంక ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంట ఉత్పత్తులను తరలించుకోవచ్చు. కానీ కొన్ని చెక్ పోస్టుల్లో సిబ్బంది చేతివాటం, ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రతి జిల్లాలో ప్రధాన పంటలుగా వరి, పత్తి, మిర్చి, వేరుశనగలలో ఏదొకటి ఉండగా, అపరాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పశుసంపద, దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. పంట, పశు ఉత్పత్తులను అమ్మకానికి తరలించేవారు చెక్‌పోస్టుల్లో మార్కెట్ ఫీజు చెల్లించాలి. వాస్తవానికి అంచనాకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. చాలా చెక్‌పోస్టుల్లో రాత్రి వేళ తరలించే పంట ఉత్పత్తి, పశుసంపదకు అనధికారికంగా వసూళ్లు చేస్తూ.. కొందరు సిబ్బంది జేబులు నింపుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా మార్కెట్ ఫీజు పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
చెక్ పోస్టుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తేనే!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో 2014-15లో రూ.438కోట్లు, 2015-16లో రూ.445.9కోట్లు, 2016-17లో రూ.476.8కోట్లు, 2017-18లో రూ.488 కోట్లు, 2018-19లో రూ.492.4కోట్లు మార్కెట్ ఫీజు వచ్చింది. 2019-20లో ఆదాయం ఓ మోస్తరుగా ఉండగా, 2020-21లో కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గింది. అయితే ఆ సమయంలో కేంద్రం తెచ్చిన ‘ఒక దేశం- ఒక మార్కెట్’ చట్టంతో రాష్ట్రంలో మార్కెటింగ్ చెక్‌పోస్టులు మూతపడ్డాయి. తర్వాత ఆ చట్టం రద్దు కావడంతో చెక్‌పోస్టులు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ కొందరు సిబ్బంది చేతివాటంతో ఆదాయం తగ్గుతోంది. గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డులకు నియమితులైనవారిలో చాలామంది ఈ అక్రమార్జనలో వాటాలు పుచ్చుకుని ఆదాయానికి గండికొట్టారన్న ఆరోపణలున్నాయి. శాఖలో విజిలెన్స్ విభాగం ఉన్నా.. చెక్‌పోస్టుల నిర్వహణపై నిఘా లోపించింది. అందువల్ల అన్ని చెక్‌పోస్టుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..