Share News

Guntur Mirchi Yard: గుంటూరు యార్డులో రైతులే మిర్చిని అమ్మాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:26 AM

గుంటూరు మిర్చి యార్డులో రైతులే అమ్ముకునేలా చూడాలని, ఇతర రాష్ట్రాల వ్యాపారుల మిర్చిని అనుమతించవద్దని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర రావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Guntur Mirchi Yard: గుంటూరు యార్డులో రైతులే మిర్చిని అమ్మాలి

ఏ రాష్ట్రమైనా వ్యాపారులకు అవకాశం లేదు: మంత్రి అచ్చెన్న

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గుంటూరు మిర్చి యార్డులో రైతులే అమ్ముకోవాలని, ఇతర రాష్ట్రాల వ్యాపారులు, మధ్యవర్తుల సరుకును అనుమతించవద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుని, వారి సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో మిర్చి రైతుల సమస్యలపై వ్యవసాయ, మార్కెటింగ్‌, బ్యాంకు అధికారులు, కోల్డ్‌స్టోరేజీల యజమాన్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుంటూరు మిర్చి యార్డుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు పెద్ద మొత్తంలో సరుకు తెచ్చి అమ్ముతుండటంతో, ఇక్కడి రైతులకు సరైన ధర రావట్లేదనే వాదన ఉందని చెప్పారు. పక్క రాష్ట్రాల రైతులు మిర్చిని తెచ్చి అమ్ముకోవటానికి అభ్యంతరం లేదన్నారు. కర్ణాటక నుంచి మిర్చిని తెచ్చి, గుంటూరు యార్డులో అమ్ముకునే వ్యాపారులను నియంత్రించాలని ఆధికారులను ఆదేశించారు. ఇక్కడ మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులైౖనా ఇక్కడ అమ్మడానికి లేదని, రైతులు మాత్రమే అమ్ముకునే చూడాలన్నారు. జగ్గయ్యపేట కోల్డ్‌స్టోరేజ్‌కి యాజమాన్యం బీమా కట్టకపోవడం వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆ నష్టాన్ని యాజమాన్యం భరించాలని మంత్రి చెప్పారు. కోల్డ్‌స్టోరేజ్‌లు బీమాను పునరుద్ధరించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో మిర్చి, ఇతర పంటలు నిల్వ చేసినప్పుడు బ్యాంకర్లు రుణాలివ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని, సకాలంలో రీషెడ్యూల్‌ చేయాలని కోరారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో సకల సౌకర్యాలతో ఒక్కో ఆధునిక రైతుబజారు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులను మంత్రి అచ్చెన్న ఆదేశించారు.

Updated Date - Mar 29 , 2025 | 05:27 AM