Share News

Nimmala Ramanaidu: జగన్‌ చిల్లుపడిన కుండ ఇచ్చారు

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:29 AM

పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని 2027 లోగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్‌ పాలనను విమర్శించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు భరోసా ఇస్తామని వెల్లడించారు.

Nimmala Ramanaidu: జగన్‌ చిల్లుపడిన కుండ ఇచ్చారు

ఎంత నీరు పోసినా పోతోంది: నిమ్మల

రూ.1,200 కోట్లతో పోలవరం ఎడమ కాలువ పనులు

మే నెలాఖరుకు డయాఫ్రం వాల్‌, బట్రస్‌ డ్యాం పూర్తి

2027 డిసెంబరు నాటికి పోలవరం కూడా: మంత్రి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఖాళీ కుండ ఇచ్చి ఉంటే దానిని తమ నాయకుడు చంద్రబాబు తన ఆలోచనతో సంపద సృష్టించి నింపుతారని.. కానీ జగన్‌ తమకు చిల్లుపడిన కుండ ఇచ్చారని, దీంతో అందులో ఎంత నీరు పోసినా పోతోందని జలవనరుల మంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అంతా పోయే పరిస్థితి ఉందన్నారు. అయినా సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు రూ.1,200 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రూ.990 కోట్లతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్‌లో ఇప్పటికి 202 మీటర్లకు పైగా నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్‌ అందుబాటులోకి వస్తుందని.. వర్షాకాలంలో కూడా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎగువ కాఫర్‌ డ్యాంను బలోపేతం చేసి మే నెలాఖరుకు వాల్‌తోపాటు బట్రస్‌ డ్యాంను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-1 వద్ద పనులు చేస్తున్నామన్నారు. గ్యాప్‌-2 వద్ద పనులు నవంబరు 30లోగా మొదలుపెడతామని చెప్పారు. చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. జగన్‌ తమ శాఖలో రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టివెళ్లాడని.. లస్కర్లకు కూడా ఏడాది జీతాలు ఇవ్వకపోతే తామొచ్చాక చెల్లించామని చెప్పారు. సమావేశంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి తదితరులు పాల్గొన్నారు.


అన్న క్యాంటీన్‌లో భోంచేసిన నిమ్మల

మంత్రి నిమ్మల రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాస్పత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి భోజనం చేశారు. భోజనం వేడిగా, శుచిగా, శుభ్రంగా ఉందన్నారు. జగన్‌ అన్న క్యాంటీన్లు మూసివేయడంతో పేదలు ఐదేళ్లు బాధలు పడ్డారని.. పాలకొల్లులో తాను, రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు సొంత ఖర్చులతో, కొందరి సహకారంతో క్యాంటీన్లను నిర్వహించామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రవ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి కార్మికులు, పేదలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల ఆకలి బాధలు తీరుస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:29 AM