దయనీయం
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:32 AM
ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. దిగుబడుల ఆధారంగా కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఆ శాఖ అనాలోచిత నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాగా, కేవలం యాభై వేల టన్నుల కొనుగోలుకు అనుమతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండిన పంట నిల్వ చేసుకొనే అవకాశం లేక అన్నదాతలు ధాన్యాన్ని అతి తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
-జిల్లాలో ధాన్యం దిగుబడి 1.60 లక్షల టన్నులు
-50 వేల టన్నుల కొనుగోలుకే అధికారుల అనుమతి
-మిగిలిన ధాన్యం ఏం చేయాలో దిక్కుతోచనిస్థితి
- ఇదే అదనుగా తక్కువ ధరకు తన్నుకుపోతున్న మిల్లర్లు, దళారులు
ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. దిగుబడుల ఆధారంగా కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఆ శాఖ అనాలోచిత నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాగా, కేవలం యాభై వేల టన్నుల కొనుగోలుకు అనుమతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండిన పంట నిల్వ చేసుకొనే అవకాశం లేక అన్నదాతలు ధాన్యాన్ని అతి తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
నందిగామ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సాగు సమయంలో భారీ వర్షాలు, వరదలతో ఎన్టీఆర్ జిల్లా మొత్తం వరి పంట దెబ్బతింది. పెట్టుబడులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. తిండి గింజల కోసం తిరిగి సాగు చేపట్టిన రైతులు భారీ పెట్టుబడులు పెట్టి అరకొర పంటను తెచ్చుకోగలిగారు. తీవ్ర నష్టాల పాలైనా సాగుపై ఆశ చావక అన్నదాతలు 50,464 ఎకరాల్లో రబీ సాగు చేపట్టారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతులకు రబీ ధాన్యపు రాసులందించింది. దిగుబడులు భారీగా వచ్చాయి. కొన్ని చోట్ల ఎకరాలకు యాభై నుంచి అరవై బస్తాల వరకూ గణనీయమైన దిగుబడి వచ్చింది. నేడు జిల్లాలో రైతుల వద్ద 1.60 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. భారీ దిగుబడులు సాధించిన అన్నదాతకు ప్రభుత్వం కూడా అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. క్వింటా ధాన్యం రూ.2,320 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలలో సొమ్ము చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. దీంతో అన్నదాతలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు. పౌరసరఫరాల శాఖ అనాలోచిత నిర్ణయాల వల్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. పండిన పంటను నిల్వ చేసుకొనే అవకాశం లేక పోవడంతో పాటు సాగుకు చేసిన అప్పులు వడ్డీలు పెరుగుతుండడంతో అన్నదాతలు కలత చెందుతున్నారు.
హామీలేనా లేక ఆచరణ ఉందా మంత్రి గారూ..
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామంటూ పలు మార్లు ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉండగా, కేవలం పది వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిన పౌర సరఫరాల శాఖ తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకుంది. జిల్లాలో మొత్తం 27 మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం కేవలం పదివేల టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గిట్టుబాటు కాదని భావించిన పది మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు నిరాకరించాయి. మిగిలిన మిల్లర్లు కూడా కొద్ది మొత్తం ధాన్యం కొనుగోళ్ల కోసం కార్మికులను సిద్ధం చేసుకోలేమని చెప్పడంతో అతి కష్టం మీద 50వేల టన్నుల కొనుగోళ్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కొనుగోలుకు సిద్ధమైన మిల్లుల యజమానులు ఆ మేర ఇతర రాషా్ట్రల నుంచి కార్మికులను దిగుమతి చేసుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమైనా పలు సమస్యలు వెంటాడుతూ వచ్చాయి. యాభై వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కనీసం 12 లక్షల బ్యాగ్‌లు కావల్సి ఉంది. ముందస్తు ప్రణాళిక లేక పోవడంతో అధికారులు సకాలంలో బ్యాగ్‌లు అందించలేకపోయారు. ఖరీఫ్ కొనుగోళ్ల సమయంలో సరుకు రవాణా చేసిన ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు సకాలంలో సొమ్ము చెల్లింపులు జరగలేదు. దీంతో రబీ సరుకు రవాణాకు వేగంగా లారీలు పంపకుండా జాప్యం వహించారు. దీంతో కొనుగోళ్లు మందగించాయి. ఫలితంగా ఇప్పటి వరకూ కేవలం 35వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. మూడింట ఒక వంతు పంట కొనుగోలుకే ఆపసోపాలు పడుతున్న నేపధ్యంలో మంత్రి ప్రకటనలపై అన్నదాతలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావలా వంతు కొనుగోలు చేయలేని పౌరసరఫరాల శాఖ ప్రతి గింజా కొనగలదా.. ఇచ్చిన హామీలను మంత్రి నిలబెట్టుకోగలరా అన్న చర్చ సాగుతుంది. తక్షణమే మంత్రి నాదెండ్ల ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించి తమకు సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాంక్ గ్యారెంటీల సమస్య
ధాన్యం కొనుగోలు చేసే మిల్లుల యజమానులు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ(బీజీలు) ఇవ్వాల్సి ఉంది. ఒక్కొక్క మిల్లరు రూ.2 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు. వారు ఇచ్చిన బీజీలకు రెట్టింపు సరుకు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన సరుకుకు ఆ మొత్తం బీజీ సరిపోయింది. ఇంకా ధాన్యం కొనాలంటే బ్యాంక్ గ్యారెంటీ పెంచాల్సి ఉంది. కానీ బ్యాంక్ గ్యారెంటీ పెంచేందుకు మిల్లర్లు సిద్ధంగా లేక పోవడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిల్లర్ల ఇచ్చిన రెండు కోట్ల బీజీలకు గాను ప్రభుత్వం మరో రెండు కోట్లు వెసులుబాటు ఇచ్చింది. కానీ ఐదు రెట్లు వెసులుబాటు ఇస్తేనే పూర్తి ధాన్యం కొనగలమని మిల్లర్లు భీష్మించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్యాంక్ గ్యారెంటీల సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
దోపిడీ చేస్తున్న దళారులు, మిల్లర్లు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతిని ఆసరా చేసుకొని దళారులు, రైస్ మిల్లుల యజమానులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,320 మద్దత ధర ప్రకటించింది. కొనుగోళ్లు జరపకపోవడంలో నిర్లక్ష్యం వల్ల దళారులకు అవకాశం వచ్చింది. కల్లాల్లో ఉన్న పంట ఇంటికి తెచ్చి దాచుకొనే అవకాశం లేక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు పడే సూచనలు ఉండడంతో నిస్సహాయతతో ఉన్న అన్నదాతను దోచుకొనేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. క్వింటాకు కేవలం రూ.1200 నుంచి రూ.1500 వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు అవినీతి అధికారుల సాయంతో మిల్లులకు అమ్మి మద్దతు ధర పొందుతున్నారు. మరో వైపు ఆర్థికంగా బలపడి ఉన్న కొందరు మిల్లర్లు నేరుగా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు చూపిస్తూ వారి సొంత మనుషుల ఖాతాలకు సొమ్ము జమ చేయిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన 35 వేల టన్నుల ధాన్యంలో సగానికి పైగా అలానే కొనుగోలు చేసినట్లు సమాచారం.