Share News

Operation Garuda: మందులపై ‘ఆపరేషన్‌ గరుడ’

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:52 AM

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలైన విజిలెన్స్‌, ఈగల్‌, డ్రగ్‌ కంట్రోల్‌తోపాటు పోలీసులు 100 బృందాలుగా ఏర్పడి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 645 మెడికల్‌ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్‌ మొదలుకొని మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తున్న నిద్రమాత్రలు, మత్తు మందులు, కాలంచెల్లిన ఔషధాలను గుర్తించారు.

Operation Garuda: మందులపై ‘ఆపరేషన్‌ గరుడ’

రాష్ట్రవ్యాప్తంగా 645 మెడికల్‌ స్టోర్లు, ఏజెన్సీల్లో తనిఖీలు

ఏకకాలంలో వంద బృందాలతో సోదాలు

ప్రిస్ర్కిప్షన్‌ లేకున్నా నిద్రమాత్రలు, మత్తుమందుల విక్రయం

కాలం చెల్లిన ఔషధాలు కూడా అమ్ముతున్నట్టు గుర్తింపు

అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

త్తు మహమ్మారికి సమాధి కట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ గరుడ’ మొదలైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలైన విజిలెన్స్‌, ఈగల్‌, డ్రగ్‌ కంట్రోల్‌తోపాటు పోలీసులు 100 బృందాలుగా ఏర్పడి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 645 మెడికల్‌ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్‌ మొదలుకొని మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తున్న నిద్రమాత్రలు, మత్తు మందులు, కాలంచెల్లిన ఔషధాలను గుర్తించారు. శుక్రవారం ఉదయం నుంచి అనేక చోట్ల ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో అవకతవకలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్‌ డీజీ హోదాలో డీజీపీ హరీశ్‌ గుప్తా ఈ తనిఖీలను పర్యవేక్షించి ఎక్కడికక్కడ చట్టపరమైన చర్యలకు ఆదేశాలిచ్చారు. ఆపరేషన్‌ గరుడకు నాయకత్వం వహించిన ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయిలో తనిఖీల్లో పాల్గొని నాలుగు విభాగాల బృందాలను సమన్వయం చేశారు. పలు జిల్లాల్లోని మెడికల్‌ షాపుల్లో అల్ఫాజోలమ్‌, ట్రెమడాల్‌ లాంటి మత్తు మందులు వైద్యుల సిఫారసు లేకుండానే విక్రయిస్తున్నట్లు గుర్తించామని తనిఖీ బృందాలు విజిలెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు సమాచారం ఇచ్చాయి. కొన్నిచోట్ల మానసిక రోగులకు విక్రయించాల్సిన మత్తు బిళ్లలను యువతకు అమ్ముతున్నట్లు తేలిందని, ఉమ్మడి కడప జిల్లాతోపాటు కొన్నిచోట్ల రికార్డులు సీజ్‌ చేశామని రవికృష్ణ తెలిపారు.

gfk.jpg

కాగా.. నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, కడప, నంద్యాల, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో వైద్యుల సిఫారసు లేకుండా నిద్ర మాత్రల విక్రయాలు జరుగుతున్నట్లు పసిగట్టినట్లు తెలిసింది. విజిలెన్స్‌, పోలీసు, ఈగల్‌ (టోల్‌ ఫ్రీ 1972)కు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.


గుంటూరులో సాధారణ కస్టమర్లలా వెళ్లి..

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు రిటైల్‌ మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఎప్పటిలా మొక్కుబడి తనిఖీల్లా కాకుండా ఈసారి పక్కాప్లాన్‌తో దాడులు చేశారు. ముందుగా మఫ్టీలో ఉన్న పోలీసులను సాధారణ వినియోగదారులుగా మందుల దుకాణాలకు పంపారు. వీరికి సదరు దుకాణదారుడు డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండానే మత్తు బిళ్లలు, యాంటీ బయోటిక్‌ మందులు విక్రయించండంతో.. సదరు పోలీసులనే సాక్షులుగా పెట్టి వారిపై కేసులు నమోదు చేశారు. ఇవి నార్కోటిక్‌ డ్రగ్‌ కిందకు రావడంతో 14 రోజుల పాటు రిమాండ్‌ తప్పదని, బెయిల్‌ కూడా రాదని అధికారులు చెబుతున్నారు. గుంటూరులో మూడు, పల్నాడులో రెండు, బాపట్లలో రెండు మందుల షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన తనిఖీల్లో అల్‌ఫ్రాజోల్‌, అల్బెండాజోల్‌, ట్రమడాల్‌ వంటి 41 రకాల మత్తు మందులను అధిక మొత్తంలో స్టాకు పెట్టుకున్నట్టు గుర్తించారు. అవనిగడ్డలో రూ.55 వేల విలువైన ట్రెమడాల్‌, అల్ర్ఫాజాలమ్‌ మందుబిళ్లలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మెడికల్‌ షాపుల్లో చూపిన స్టాక్‌ రిజిస్టర్‌కు, ఉన్న స్టాక్‌కు లెక్క తేడా ఉందని గుర్తించారు. అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లో కాలంచెల్లిన ఔషధాలు, ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందలు అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో 10 మెడికల్‌ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. విజయనగరంలోని వెంకటరత్నం మెడికల్‌ స్టోర్సులో కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తు మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం నిర్వాహకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో తొమ్మిది షాపుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిషేధిత మందులు విక్రయిస్తున్న పెంజర్ల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 03:52 AM