పడిపోయిన బొప్పాయి ధరలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:03 AM
బొప్పాయి ధర లేక రైతులు కుదేలవుతున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
గత నెల టన్ను రూ.20 వేలు
ప్రస్తుతం రూ.5 వేలు
తోటలను దున్నేస్తున్న రైతులు
చాగలమర్రి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): బొప్పాయి ధర లేక రైతులు కుదేలవుతున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే టన్నుకు రూ.15వేలకు పైగా ధర పడిపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి గ్రామంలో సోమవారం కొందరు రైతులు ఆశలు వదులుకొని బొప్పాయి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష దాక వ్యయం చేశామని, ధర లేక బొప్పాయి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు వెంకటరెడ్డి, నరసింహులు, రమణారెడ్డి, నాగిరెడ్డి, జయరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఎకరాల దాక బొప్పాయి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. గత నెలలో టన్ను బొప్పాయి రూ.20 వేలు పలికిందని, ప్రస్తుతం ధర రూ.5 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొప్పాయి కాయలు చెట్లకు ఉన్నా పెట్టుబడులు కూడా రావని ట్రాక్టర్లతో దున్నేస్తున్నట్లు తెలిపారు. పంట దిగుబడి ఉన్నా ధర పతనంతో నష్టపోయామని రైతులు వాపోయారు. అధిక వర్షాలు, వైరస్ వల్ల కూడా తోటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.