Pastor Praveen: విజయవాడలో ఆ 4 గంటలు..
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:07 AM
పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విజయవాడలో నాలుగు గంటల పాటు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్నచిక్కుముళ్లు
విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం
పగిలిన బుల్లెట్ హెడ్‌లైట్.. పాస్టర్ చేతికి గాయాలు
గొల్లపూడి పెట్రోలు బంకు వద్దకు చేరే సమయానికి
సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైగలు
రామవరప్పాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదం
పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్‌ఐ, ఆటో డ్రైవర్లు
ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టర్
మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని
పాస్టర్‌కు ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు కౌన్సెలింగ్
వెళ్లొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం
తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు
సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు.
కోదాడలో మద్యం సీసా కొనుగోలు..
పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన విషయం తెలిసిందే. అదేరోజు మధ్యా హ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో రూ.650తో మద్యం సీసా కొనుగోలు చేసి, ఫోన్‌పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల-పరిటాల మధ్య అదుపుతప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యా యి. అక్కడినుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్‌లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంక్‌కు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేళ్లు చూపించారు. రూ.800కు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. ఎనిమిది లీటర్లు పోయమంటారా అంటే అడిగితే అవునని సంకేతం ఇస్తూ తల పైకి, కిందకు ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు రూ.872 ఫోన్ పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్‌లైడ్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లై ఓవర్, రాజీవ్‌గాంధీ పార్కు, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మీదుగా బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నారు.
‘మహానాడు’ దాటాక కాసేపు మాయం..
ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి- రామవరప్పాడు రింగ్‌కు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగ్‌కు పది మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్‌పై నుంచి ఆయన పడిపోయారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు రింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్‌ను పైకి లేపి పక్కన ఉన్న రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్‌ను ఎస్‌ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ, బుల్లెట్‌ను ఆటోడ్రైవర్లు తోసుకుంటూ రింగ్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్‌ఐ నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్రలేచ్చాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్‌ఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీస్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్‌పై ఏలూరు వైపు బయల్దేరారు. ట్రాఫిక్ ఎస్‌ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్‌ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టోల్‌గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్‌లో మద్యం కొని, రూ.350 ఫోన్‌పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణానికి పక్కాగా ఏర్పాట్లు..
హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్‌కు వెనుక ఒక బ్యాగ్ పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునే లోపు అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుపోయినట్టుగా గాయాలు ఉండటం, హెల్మెట్‌కు సొట్ట పడటంతో వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫొటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్‌ఐ సుబ్బారావు వివరించారు.
సీసీ కెమెరాలు చూపించిన సమయాలు..
4వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోలు బంక్‌కు చేరుకున్నారు.
5.13 గంటలకు మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు.
5.30 గంటలకు పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు.
5.30- 8.20 గంటల వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు.
రాత్రి 8.47 గంటలకు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News