Share News

Kashmir Terror Attack,: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:58 AM

కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని వివిధ రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, నారాయణ, రామ్మోహన్ నాయుడు సహా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇతర నేతలు ఉగ్రదాడిని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 Kashmir Terror Attack,: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం

సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌

అమరావతి, నెల్లూరు, అరసవల్లి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌, పహల్గాంలో ఉగ్రదాడిని వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందడం, వారిలో రాష్ట్రానికి చెందిన జేఎస్‌ చంద్రమౌళి, మధుసూదన్‌ ఉండడం నన్ను కలసివేసింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ... ఉగ్రదాడిలో మృతి చెందిన తెలుగువారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మంత్రి నారాయణ స్పందిస్తూ... ‘కశ్మీర్‌లో ఉగ్రదాడి దారుణ సంఘటన తీవ్రంగా కలచివేసింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు మృతి చాలా బాధ కలిగించింది. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పిస్తున్నా’ అని అన్నారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ బుధవారం ఓ ప్రకటన చేస్తూ... ‘ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ అమానుష దాడిని ఖండించడానికి మాటలు చాలవు. ఈ ఘోర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం. దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలి’ అని కోరారు. కశ్మీర్‌లో అమాయక ప్రజలపై చేసిన ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాలులర్పించారు. ‘శ్రీనగర్‌ నుంచి మొత్తం 4,500 మందిని వారివారి ఇళ్లకు క్షేమంగా చేర్చేందుకు 35 విమానాలను ఏర్పాటు చేశాం’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


ఉగ్రదాడిపై జనసేన ఆవేదన

పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని అధినేత సూచించారు. బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలంటూ ఓ ప్రకటన చేశారు. ఘటనలో మృతి చెందిన తెలుగువారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఒక నోడల్‌ అధికారిని నియమించినట్లు చెప్పారు. సహాయం కోసం 9818395787, 011 23387089 నంబర్లలో సంప్రదించాలని ఎంపీ సూచించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:58 AM