Power Distribution Companies: డిస్కమ్‌ల నష్టాలకు ప్రైవేటీకరణే పరిష్కారం కాదు
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:58 AM
డిస్కమ్‌ల ఆర్థిక సంక్షోభానికి ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదని రాష్ట్రాల ఇంధన మంత్రుల సమావేశంలో అభిప్రాయపడారు. ధనికులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల డిస్కమ్‌లు నష్టాల్లో పడుతున్నాయని పేర్కొన్నారు.
డిస్కమ్‌ల బలోపేతంపై నెలాఖరుకు ముసాయిదా: మంత్రి యశోనాయక్
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్న విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లను కాపాడుకోవాలంటే ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే పరిష్కారం కాదని కేంద్ర పునరుద్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన జరిగిన నాలుగో రాష్ట్రాల ఇంధన శాఖా మంత్రుల సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలంటే.. కరెంటు కొనుగోలు వాస్తవ వ్యయాన్ని డిస్కమ్‌లు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ఈ నెలాఖరులోగా ముసాయిదా నివేదికను వెలువరిస్తామని యశోనాయక్ వెల్లడించారు. ధనికుల్లో 15శాతం మంది దాకా విద్యుత్తు ఛార్జీలు చెల్లించడం లేదని.. ఇదే సమయంలో రైతులు.. పేదవారు సకాలంలో బిల్లులు కట్టకపోతే వెంటనే విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నారని సమావేశం అసహనం వ్యక్తం చేసింది. ధనికులు ఛార్జీలు చెల్లించకపోతే వారికీ తక్షణం విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్యాలయాలు.. స్థానిక సంస్థలు విద్యుత్తు ఛార్జీలు చెల్లించడం లేదని.. వీటివల్ల డిస్కమ్‌లకు వచ్చే నష్టాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. విజయవాడ వేదికగా డిస్కమ్‌ల బలోపేతంపై కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, కేంద్ర ఇంధన శాఖ (విద్యుత్తు సంస్థల సంస్కరణల విభాగం) సంయుక్త కార్యదర్శి శంశాంక్ మిశ్రా, తదితరులు హాజరయ్యారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్తు రంగ బలోపేతానికి తక్షణ ఆర్థిక సాయం అవసరమని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభ్యర్థించారు. విద్యుత్తు రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పునరుత్పాదక విద్యుత్తు రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని గొట్టిపాటి వివరించారు. పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..