Share News

PSSR Anjaneyulu: ఐపీఎస్‌ కాదు.. వైపీఎస్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:31 AM

పీఎస్సార్‌ ఆంజనేయులు వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి. జగన్‌ హయాంలో రాజకీయ మద్దతు పొందిన ఆయన ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టయ్యారు.

PSSR Anjaneyulu: ఐపీఎస్‌ కాదు.. వైపీఎస్‌

జగన్‌ హయాంలో పీఎస్సార్‌ ఆంజనేయులు ఐదేళ్లలో నాలుగు కీలక పోస్టులు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు రవాణా శాఖ కమిషనర్‌ పోస్టు, ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ను వేధించేందుకు కమిషన్‌ కార్యదర్శి పదవి, అచ్చెన్న అరెస్టు కోసం ఏసీబీ చీఫ్‌, జగన్‌ పొలిటికల్‌ అజెండా అమలుకోసం నిఘా చీఫ్‌ పదవులను వాడుకున్నట్లు చెబుతారు.

ఐపీసీని కాదని వైసీపీకి ‘సెల్యూట్‌’.. జగన్‌కు వీర విధేయుడిగా పీఎస్సార్‌

ఐదేళ్లలో నాలుగు పోస్టులు.. టీడీపీ నేతలే టార్గెట్‌గా కేసులు

సినీ నటిని వేధించడంలో కీలక పాత్ర

వెంటాడిన నాటి పాపాలు.. చివరికి అరెస్టు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’... అని నిందితులను అదుపులోకి తీసుకునే పోలీసు అధికారే ఇప్పుడు అరెస్టయ్యారు. కాలం కలిసొస్తే పోలీస్‌ బాస్‌ కావాల్సిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులు అలియాస్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు అరెస్టయ్యారు. చట్టానికి, రాజ్యాంగానికి విధేయుడిగా ఉండాల్సిన ఈ ఐపీఎస్‌ అదికారి... జగన్‌కు వీర విధేయుడిగా మారిపోయి, ‘వైపీఎస్‌’ ఆఫీసర్‌గా రూపాంతరం చెందిన ఫలితమిది! ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులు అరెస్టయ్యారు. అయితే... ఆది నుంచీ ఆయనది వివాదాస్పద చరిత్రే. కర్నూలు, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన పీఎస్సార్‌కు హనుమంతుడికి ఉన్నంత ధైర్యం ఉందనేవారు. అదే ధైర్యంతో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా తనదైన పనితీరుతో దూసుకెళ్లారు. కానీ... ఒక మహిళ ఫోన్‌కు పంపిన సందేశాలు, ఫోన్‌ సంభాషణలు బహిర్గతం కావడంతో అభాసుపాలయ్యారు. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారణంగా... పీఎస్సార్‌ ఆంజనేయులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తర్వాత... 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ రెక్కలుకట్టుకుని రాష్ట్రంలో వాలిపోయారు.


శ్రుతిమించిన జగన్‌ భక్తి...

వైసీపీ హయాంలో పీఎస్సార్‌ ఆంజనేయులు పోలీసు అధికారిగాకంటే... జగన్‌కు వీరవిధేయుడిగానే ఎక్కువగా వ్యవహరించారు. ఏ పోస్టులో ఉన్నా... టీడీపీ నేతలను టార్గెట్‌ చేసుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. ఇంకా చెప్పాలంటే... అప్పటి విపక్ష నేతలపైకి పీఎస్సార్‌ను జగన్‌ అస్త్రంగా ఉపయోగించారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉండగా... ట్రావెల్‌ బస్సులు ఆపేసి జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయించారు. ఏపీపీఎ్‌ససీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు తీసుకుని అప్పటి చైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ను మానసికంగా వేధించారు. జగన్‌ హయాంలో ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టాక పీఎస్సార్‌ మరింత చెలరేగిపోయారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక మరింత రెచ్చిపోయారు. జగన్‌ పొలిటికల్‌ అజెండాను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ‘అధినేత’ ఆదేశాల మేరకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను సైతం బెదిరించారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేసి వేధింపులకు గురి చేశారంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి(అప్పట్లో వైసీపీ) కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ తలకు తుపాకీ పెట్టి బెదిరించి బరితెగింపునకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.


ఇదే మొదటిసారి...

ఐపీఎస్‌ అధికారిగా ముప్పై సంవత్సరాలు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన డీజీపీ ర్యాంకు అధికారి విధి నిర్వహణలో కుట్రలు చేసి అరెస్టు కావడం ఇదే మొదటిసారి కావొచ్చని బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతోంది.

కేవలం జగన్‌ మెప్పుకోసం... తద్వారా డీజీపీ పదవి దక్కించుకునేందుకే పీఎస్సార్‌ ఆంజనేయులు ఐపీసీని కాదని, ‘వైసీపీ’కి జైకొట్టారనే విమర్శలున్నాయి.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 04:31 AM