Share News

Supreme Court: బోరుగడ్డకు సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:28 AM

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ తిరస్కరించింది. నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా బెయిల్‌ పొంది, వివాదాలు చోటుచేసుకున్న అతని పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Supreme Court: బోరుగడ్డకు సుప్రీంలో చుక్కెదురు

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ/అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ కోసం అతడు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో పాటు మరికొందరిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన తల్లికి అనారోగ్యమని చెబుతూ అతడు మధ్యంతర బెయిల్‌ పొందాడు. నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సృష్టించి.. కోర్టును తప్పుదోవ పట్టించి.. మధ్యంతర బెయుల్‌ పొడిగింపు పొందిన అతడు.. హైకోర్టు ఆగ్రహంతో గత నెల 12న రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు. గుంటూరు లలిత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ పీవీ రాఘవశర్మ పేరిట సర్టిఫికెట్‌ సృష్టించిన నేపథ్యంలో.. ఆ వైద్యుడి వాంగ్మూలాన్ని రికార్డు చేయించి పంపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. అది అందిన తర్వాతే బోరుగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఈ క్రమంలో బోరుగడ్డ మధ్యంతర బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్‌ తీసుకున్నారనే ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున.. బెయిల్‌ అంశంపైనా అక్కడే తేల్చుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. కాగా, బోరుగడ్డ అనిల్‌ కేసును అనంతపురం జిల్లా ఫ్యామిలీ కోర్టు మే 9వ తేదీకి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:28 AM