TDP Leader Murder: ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:16 AM
ఒంగోలు వ్యాపార కార్యాలయంలో టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తుతెలియని దుండగులు 38 సార్లు పొడిచి ఘోరంగా హత్య చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తన కార్యాలయంలో ఉన్నప్పుడే దుండగుల
దాడి.. ఆఫీసులోకి ప్రవేశించిన నలుగురు
తలుపులు మూసి కత్తులతో పొడిచి హత్య
38 కత్తి పోట్లు, చివరగా గొంతు కోసి పరార్
ఒంగోలు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో ప్రముఖ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి (47)ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతంగా హత్య చేశారు. ఆయన మంగళవారం రాత్రి 7.45 గంటల సమయంలో ఒంగోలులోని తన వ్యాపార కార్యాలయంలో ఉన్న సమయంలో నలుగురు దుండగులు ప్రవేశించి కత్తులతో విచక్షణా రహితంగా 38 సార్లు పొడిచారు. చివరగా గొంతు కోశారు. వచ్చిన దుండగులు 2 నిమిషాల్లోనే హత్య చేసి పరారయ్యారు. వీరయ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అందిన సమాచారం మేరకు.. ఒంగోలు మంగమూరు రోడ్డు సర్కిల్‌కు సమీపంలో ఉన్న భవనంలోని రెండో అంతస్తులో వీరయ్య వ్యాపార కార్యాలయం ఉంది. అందులో మంగళవారం సాయంత్రం ఆయన ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన నలుగురు దుండగులు మెట్ల మీదుగా పైకి వెళ్లి వీరయ్య గదిలోకి ప్రవేశించి తలుపులు మూసేశారు. ఆ వెంటనే కత్తులతో ఆయన మెడ మీద, గుండెలపైన విచక్షణా రహితంగా పొడిచారు.
తర్వాత నలుగురూ మోటారుసైకిళ్లపై గుంటూరు వైపు పరారయ్యారు. వీరయ్య గది పక్కనే మరో గదిలో ఉన్న వ్యక్తి ఈ ఘటనను గుర్తించి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వీరయ్యను సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి రిమ్స్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసు జాగిలాన్ని రంగంలోకి దింపారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు విషయం తెలిసిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే ఒంగోలు వెళ్లాలని మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికి ఆదేశించారు. సీఎంతో పాటు వ్యక్తిగత పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సీఎం ఆదేశాలతో ముందస్తుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు వచ్చి పార్టీ నేతలతో సమీక్షించారు. అలాగే హోంశాఖ మంత్రి అనిత.. సీఎం ఆదేశాలతో మంగళవారం అర్ధరాత్రి ఒంగోలు చేరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలుకు చేరుకుని అంతిమయాత్రలో పాల్గొంటారని తెలిసింది. అయితే అధికారికంగా కార్యక్రమం ఖరారు కాలేదు. కాగా, వీరయ్య హత్యకు గురైన విషయం తెలియగానే అతని మేనమామ, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. టీడీపీలో 1994 నుంచి వీరయ్య చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఆయన నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేశారు. అమ్మనబ్రోలులో ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..