TDP Nominated Posts: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:46 AM
టీడీపీ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల నియామక ప్రక్రియ మొదటి విడతలో 47 మందిని ప్రకటించగా, త్వరలో మరో 50 నియామకాలు జరగనున్నాయి. మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని అంచనా... వంగవీటి రాధా సీఎం చంద్రబాబును కలవడంతో ఆయనకు నామినేటెడ్ పోస్టు కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

15 రోజుల్లో మిగిలినవీ భర్తీ.. వీటితోపాటే ఆలయ కమిటీలకు కూడా
నెలాఖరులోగా పీఏసీఎ్‌సల నియామకాలు
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వస్తోంది. మొత్తం 218 ఏంఎసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తిచేసేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ అధినేత చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండడంతో కాస్త జాప్యం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటే దేవాయలయ కమిటీలనూ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎ్‌స)ల భర్తీపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,250 పీఏసీఎ్‌సలు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్‌చార్జులతో నడిపిస్తున్నారు.
సీఎంతో వంగవీటి రాధా భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధాకృష్ణ సచివాలయంలో కలిశారు. బుధవారం సాయంత్రం సుమారు అరగంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో రాధా పేరు ఉంటుందని భావించారు. కానీ ఖాళీ అయిన ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరొకటి కేటాయించడంతో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుండడంతో రాధాకు నామినేటెడ్ పోస్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపైనే రాధా పార్టీ అధినేతను కలిసినట్లు సమాచారం.
అమరావతి చిత్రకళా వీధికి సీఎం మద్దతు
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం గురించి వివరించేందుకు సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్విని బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా అమరావతి అంశంపై రూపొందించిన చిత్రలేఖనానికి చంద్రబాబు కుంచెతో రంగులు వేసి తన మద్దతు తెలిపారు. ఇక, రాజమండ్రిలో ఈనెల 4న ‘అమరావతి చిత్రకళావీధి’ నిర్వహిస్తున్నామని రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని తెలిపారు. మన కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, మంత్రి దుర్గేష్ సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..