Share News

TDP Worker Held for Remarks on YS Bharathi: వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:27 AM

వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది

TDP Worker Held for Remarks on YS Bharathi: వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

  • టీడీపీ కార్యకర్త కిరణ్‌ అరెస్టు

  • మంగళగిరి రూరల్‌ స్టేషన్‌లో కేసు

  • ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి..

  • పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టీడీపీ

గుంటూరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైసీపీ కార్యకర్త బంగు వెంకట కృష్ణారెడ్డి, సంగేవు వెంకట శివరామకృష్ణలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ ేస్టషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 155/2025గా బీఎన్‌ఎస్‌ 19(1), 79, 353(1), 61(2), 111(1), సెక్షన్‌ 7(ఎ), 37 తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చేబ్రోలు కిరణ్‌ను కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం శివారులో గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి.. మీడియా ఎదుట హాజరుపరిచారు. మాజీ సీఎం జగన్‌ పోలీసులను బట్టలూడదీస్తామని రెండు రోజుల క్రితం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో కిరణ్‌ స్పందిస్తూ, వైఎస్‌ భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియ్‌సగా పరిగణించిందని ఎస్పీ సతీశ్‌కుమార్‌ తెలిపారు. సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి హైదరాబాద్‌ మార్గంలో ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. గతంలో మాజీమంత్రి విడదల రజిని పట్ల అనుచితంగా మాట్లాడిన ఘటనపై పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కిరణ్‌పై కేసు నమోదైందన్నారు. నగరంపాలెం, గన్నవరం, తాడేపల్లి, చేబ్రోలు పోలీస్‌ ేస్టషన్‌లోనూ సోషల్‌ మీడియా పోస్టులపై కేసులు, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసిన కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు. కాగా, చేబ్రోలు కిరణ్‌పై చర్య తీసుకోవాలంటూ వైసీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కె.శామ్యూల్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు వట్టెం మనోహర్‌, ఉపాధ్యక్షుడు దివ్వెల రామారావు, గంగోలు వినోద్‌ గురువారం జగ్గయ్యపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


పవన్‌ తనయుడిపై వ్యాఖ్యలు.. కేసుల నమోదు

డిప్యూటీ సీఎం పవన్‌ తనయుడిపై ‘ఎక్స్‌’లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, విజయవాడలో రెండు కేసులు నమోదయినట్టు గుంటూరు ఎస్పీ సతీశ్‌కుమార్‌ తెలిపారు. వారు ఎవరన్నది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఎక్స్‌ సంస్థకు లేఖ రాశామని తెలిపారు. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:27 AM