Share News

Visakhapatnam: విహారంలో విషాదం

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:20 AM

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి మరియు నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదనరావు ప్రాణాలు కోల్పోయారు. వీరు తమ కుటుంబంతో కలిసి కశ్మీర్‌ విహార యాత్రకు వెళ్లి ఈ దాడిలో మృతిచెందారు.

Visakhapatnam: విహారంలో విషాదం

కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసుల దుర్మరణం

విశాఖపట్నం/కావలి రూరల్‌/నెల్లూరు (క్రైం), ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌ ఉగ్ర దాడిలో విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. భార్య, స్నేహితులతో కలిసి విహారం కోసం కశ్మీర్‌ వెళ్లారని, ఊహించని విధంగా ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం తమ కుటుంబంలో విషాదం నింపిందని ఆయన తోడల్లుడు కుమార్‌రాజా ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళానికి చెందిన జేఎస్‌ చంద్రమౌళి (68) ఎస్బీఐలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తన స్నేహితులు అప్పన్న, శేషగిరి కుటుంబాలతో కలసి ఈ నెల 18న చంద్రమౌళి దంపతులు కశ్మీర్‌ యాత్రకు వెళ్లారు. కాగా, ఉగ్రదాడి జరిగిన స్థలంలో ఒక మృతదేహం చంద్రమౌళిదిగా అధికారులు గుర్తించారు. ఉగ్రవాదుల దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు(42) దుర్మరణం పాలయ్యారు. ఆయన ఐబీఎంలో, ఈయన భార్య ప్రసన్న కామాక్షి టీసీఎ్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. బెంగుళూరులో స్థిరపడ్డారు. పిల్లలకు సెలవులు కావడంతో గత ఆదివారం రాత్రి వీరి కుటుంబం కశ్మీరు విహార యాత్రకు వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం వరకు సరదాగా సాగిన తమ యాత్ర ఫొటోలను బంధువులకు షేర్‌ చేశారు. అంతలోనే పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో మధుసూదనరావు అక్కడికక్కడే మృతిచెందారు.

Updated Date - Apr 24 , 2025 | 06:20 AM