‘పది’లో బాలికల హవా
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:12 AM
ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.
81.85 శాతం ఫలితాలతో 17వ స్థానంలో నంద్యాల జిల్లా
బాలికల ఉత్తీర్ణత 84.40 శాతం, బాలురు 79.40 శాతం
ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
గతేడాదికన్నా తగ్గిన పాస్ పర్సంటేజీ
నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నంద్యాల జిల్లా 17వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 24,496 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా అందులో 20,051 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులై 81.85 శాతం సాధించారు. అందులో 12,702 మంది బాలురు పరీక్షలు రాయగా 10,097 మంది ఉత్తీర్ణులై 79.49 శాతం ఫలితాలను సాధించారు. 11,794 మంది బాలికలు పరీక్షలు రాయగా 9,954 మంది ఉత్తీర్ణులై 84.40 శాతం ఫలితాన్ని సాధించారు. దీంతో బాలికలదే హవా కొనసాగింది. గత ఏడాది 85.62 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానంలో ఉన్న జిల్లా నేడు 81.85 ఉత్తీర్ణతతో 17వ స్థానానికి చేరుకుంది. కానీ ఉత్తీర్ణతా శాతంలో గత ఏడాది కంటే తగ్గడం గమనార్హం.
ఫ మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
నంద్యాల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. బండిఆత్మకూరు జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న సుమంత 591 మార్కులతో టాపర్‌గా నిలిచారు. అలాగే బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న కావేరి 580 మార్కులు సాధించారు. రుద్రవరం మండలం ఎల్తావత్తుల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సాదా నాగేంద్రబాబు 592 మార్కులు సాధించాడు. నంద్యాల మండలం చాబోలు జడ్పీ పాఠశాలకు చెందిన పబ్బతి సాగర్ 587 మార్కులు సాధించాడు. బండిఆత్మకూరు యర్రగుంట్ల జడ్పీ పాఠశాలకు చెందిన శ్రుతి 584 మార్కులు సాధించింది.
నంద్యాల శ్రీలక్ష్మీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన షేక్ ఇష్రత 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే 2వస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇష్రత తండ్రి డాక్టర్ షేక్ మహ్మద్‌రఫి, తల్లి ఫిర్దోస్‌భానులది నందికొట్కూరు పట్టణం కాగా పిల్లల చదువుకోసం ఆరేళ్ల క్రితం నంద్యాలకు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇష్రత శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లోనే చదువుతున్నారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇష్రత ఎంతో చురుగ్గా ఉంటూ అన్నితరగతుల్లో టాపర్‌గా రాణిస్తుండేదని, పది పరీక్షలో ఇంతస్థాయిలో మార్కులు సాఽధిస్తుందని ఊహించలేదని అటు తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం లక్ష్మీరెడ్డి, శ్రీలక్ష్మిలు పేర్కొన్నారు. ఎంతో పట్టుదల, ఏకాగ్రత ఉన్న శ్రీలక్ష్మీని ఎప్పుడూ ఒత్తిడికి గురిచేయలేదని, తరగతి గదిలో తప్ప ఇంటికి రాగానే పుస్తకాల జోలికి వెళ్లలేదని, ఒక్క పరీక్షా సమయంలో మాత్రమే ఇంట్లో చదివిందని తల్లి ఫిర్దోస్‌భాను తెలిపారు.
ఫ డాక్టర్ కావాలని ఉంది
- ఇష్రత, 599 మార్కులు, నంద్యాల
నేను ఎప్పుడూ 24 గంటలు చదివేదాన్ని కాదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే చదువుతాను. తర్వాత ఏ పుస్తకం పట్టుకోను. అప్పుడప్పుడూ సెల్‌ఫోనలో వస్తున్న సెమినార్‌లను తీక్షణంగా చూస్తాను. నాకు ఏదైనా అర్ధం కాకుంటే వెంటనే టీచర్లను సంప్రదించి క్లియర్ చేసుకుంటాను. ఎప్పుడూ నేను ఒత్తిడికి గురికాలేదు. డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలని ఉంది. కొందరు వైద్యులు అధిక ఫీజులు వసూలు చేస్తుండడం ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయా. ఏమైనా సరే ఖచ్చితంగా డాక్టరు అయి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేయాలని ఉంది.
‘గురురాజ’ విద్యార్థికి 597 మార్కులు
నంద్యాల శ్రీగురురాజ విద్యాసంస్థల విద్యార్థి యర్రం వెంకట సాయి సుబ్బనర్సిరెడ్డి 600 మార్కులు 597 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. 597 మార్కులు సాధించడంపై దొర్నిపాడు గ్రామానికి తల్లిదండ్రులు నర్సిరెడ్డి, సుజాతలు హర్షం వ్యక్తం చేశారు. తమ విద్యార్థి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందని గురురాజ విద్యాసంస్థల ఛైర్మన దస్తగిరిరెడ్డి, డైరక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలిరెడ్డి అన్నారు. ఐఐటీ చేసి మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి స్థిరపడి తమకోసం ఎంతో కష్టపడుతున్న తల్లిదండ్రులకు అండగా ఉంటానని వెంకటసాయి తెలిపారు.
ఫ డోన పట్టణంలోని సుధా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి విజయ దుర్గాప్రసాద్ 597 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాచారు. తండ్రి జ్ఞానశేఖర్, తల్లి నాగరాణిలు. తండ్రి ఆటోమెకానిక్‌గా పనిచేస్తూ కుమారున్ని చదివిస్తున్నాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని అంటున్నారు.
ఫ ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన డాక్టర్ పీవీ నాగేశ్వరరాజు, రాజ్యలక్ష్మి కుమార్తె భవ్య దీప్సిక 597 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఆమె డాక్టర్ కావడమే తన లక్ష్యమని తెలిపారు.
ఫనంద్యాల గుడ్‌షెప్పర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన సాయి సహస్ర, దీక్షితారెడ్డి, వెంటకసాయిసంతోష్‌లు 596 మార్కులు సాధించారు.
ఫ పాములపాడు మండలంలోని ఏపీ మోడల్‌స్కూల్ విద్యార్థి జంగాల మల్లన్న 593 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. వారి తల్లిదండ్రులు సాయిలు, యల్లమ్మలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడిని మంచిగా చదివించుకోవాలని రెక్కలు ముక్కలు చేసుకుని అహర్నిశలు శ్రమించారు. అయితే ఆ తల్లిదండ్రుల ఆశయాలను ఏ మాత్రం నీరుకార్చకుండా మల్లన్న కష్టపడి చదివి 593 మార్కులతో టాపర్‌గా నిలిచారు. రైతు బిడ్డగా మరిన్ని విజయాలు సాధించి కలెక్టర్ అవుతానని చెబుతున్నారు.