Share News

ఫలితాల టెనషన..

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:14 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాల మరో 24 గంటల్లో విడుదల కానున్నాయి.

   ఫలితాల టెనషన..

రేపు పది పరీక్షా ఫలితాలు

ఉదయం 10 గంటలకు విడుదల

తేలనున్న 25,542 మంది విద్యార్థుల భవితవ్యం

నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాల మరో 24 గంటల్లో విడుదల కానున్నాయి. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ఫలితాల విడుదలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫలితాలను 23వతేదీ ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 25,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 13,353 మంది బాలురు, 12,189 మంది బాలికలు ఉన్నారు. 285 ప్రభుత్వ పాఠశాలలు, 173 ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్‌ విద్యార్థులు 20,021, ఒకేషనల్‌ 4,752, సప్లిమెంటరీ 769 మంది విద్యార్థులున్నారు.

ఫ గత ఏడాది బాలికలదే హవా!

గత ఏడాది 23,787 మంది పరీక్షలు రాయగా 20,367 మంది ఉత్తీర్ణత సాధించి 85.62 శాతంతో నంద్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది. అందులో బాలికలు 88.24 శాతం, బాలురు 83.17 శాతం సాధించారు. బాలికలదే పైచేయిగా ఉంది. జిల్లాలోని 16 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 72.10 శాతం, 6 బీసీ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 99, 12 ప్రభుత్వ పాఠశాలల్లో 67.90, ఐదు ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలల్లో 79.44, 27 కేజీబీవీల్లో 88.14, నాలుగు మున్సిపల్‌ హైస్కూల్స్‌లో 79.12, 20 మోడల్‌ స్కూల్స్‌లో 95.11, 173 ప్రైవేట్‌ పాఠశాలల్లో 97.37, 7 ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో 89.78శాతం, 182 జడ్పీ పాఠశాలల్లో 76.57 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫ మన మిత్ర ద్వారా ఫలితాలు

విద్యార్థులు మన మిత్ర వాట్సాప్‌ నుంచి ఫలితాలు పొందవచ్చు. 9552300009 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపి, ఆ తర్వాత విద్యాసేవలను ఎంచుకుని, ఆపై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం వారి రోల్‌నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాల పీడీఎఫ్‌ కాపీని పొందవచ్చు. అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన ద్వారా డౌనలోడ్‌ చేసుకోవచ్చు.

Updated Date - Apr 22 , 2025 | 12:14 AM