Train Robbery: రైల్లో దొంగలు పడ్డారు!
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:02 AM
నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్ స్టేషన్ సమీపంలో చండీగఢ్-మదురై సూపర్‌ఫాస్ట్ రైలు దోపిడీకి గురైంది. దొంగలు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రైలును ఆపి, ప్రయాణికులపై దాడి చేసి ఆభరణాలు, నగదు దోచుకున్నారు.

సిగ్నల్ ట్యాంపర్ చేసి పక్కాగా పథకం
నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్ వద్ద స్కెచ్
తొలుత తప్పించుకున్న హౌరా-బెంగళూరు రైలు
తర్వాత వచ్చిన చండీగఢ్-మదురై ఎక్స్‌ప్రెస్
సిగ్నల్ లేక రైలు ఆగగానే దొంగల బీభత్సం
ముందే ప్రయాణికుల్లా ఎక్కిన ఇద్దరు దొంగలు
కింద సిగ్నల్‌ను ట్యాంపర్ చేసిన మరో ముగ్గురు
2 బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు
ప్రయాణికులు తిరగబడటంతో పరార్
(బిట్రగుంట/నెల్లూరు క్రైం-ఆంధ్రజ్యోతి)
అర్ధరాత్రి కావస్తోంది! చండీగఢ్-మదురై సూపర్‌ఫాస్ట్ రైలు పరుగులు తీస్తోంది. కొందరు ప్రయాణికులు అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు.. నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అంతలోనే.. రైలు ఒక్కసారిగా ఆగింది. క్షణాల్లోనే దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. హల్‌చల్ చేశారు! ప్రయాణికులు ఎదురు తిరగడంతో పరారయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్ స్టేషన్ సమీపంలో సినిమా ఫక్కీలో జరిగిన సంఘటన ఇది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అల్లూరు రోడ్డు స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో... ఎగువ మార్గం హోం సిగ్నల్ వద్ద రైళ్లను ఆపి దోచుకునేందుకు దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం ఏకంగా సిగ్నల్ పని చేయకుండా సాంకేతిక సమస్యను సృష్టించారు. రైలు పట్టాల కట్‌పాయింట్ వద్ద నాణేలు పెట్టి రైలు సిగ్నల్ వ్యవస్థను డ్రాప్ చేశారు. అలాగే... సమీపంలో ఉండే సిగ్నల్ బోర్డులో వైర్లను కత్తిరించి సిగ్నల్‌ను హ్యాక్ చేశారు. మంగళవారం రాత్రి 11.10 గంటల ప్రాంతంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్లే సూపర్ ఫాస్ట్ (12863) రైలును ఇలా ఆపేందుకు ప్రయత్నించారు. అప్పటికే... రైలు చాలా వేగంగా ప్రయాణిస్తోంది.
సిగ్నల్ చూసి లోకో పైలట్ బ్రేకులు వేసినప్పటికీ... మూడు నిమిషాల తర్వాత అది అల్లూరు రోడ్డు స్టేషన్‌లో ఆగింది. 11.29 గంటలకు గ్రీన్ సిగ్నల్ పడటంతో హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ముందుకు కదిలింది. దీంతో దొంగల తొలిప్రయత్నం విఫలమైంది.
ఈసారి మరో రైలు...
దొంగలు సిగ్నల్ ట్యాంపర్ చేసిన అదే మార్గంలో... 40 నిమిషాల తర్వాత చండీగఢ్ - మధురై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20494) వచ్చింది. 11.50 గంటల ప్రాంతంలో లోకో పైలట్ ఎల్లో సిగ్నల్‌ను గమనించి వెంటనే బ్రేకులు వేశారు. అంతకుముందు స్టేషన్‌లోనే స్లీపర్ కోచ్‌లలోకి ఇద్దరు దొంగలు ప్రయాణికుల్లాగా ఎక్కారు. మరో ముగ్గురు దొంగలు కింద ఉండి... సిగ్నల్ ట్యాంపర్ చేశారు. రైలు ఆగగానే... కింద ఉన్న దొంగలు లోపలికి ఎక్కారు. అప్పటికే లోపలున్న వాళ్లతో కలిసి ఎస్4, ఎస్5 కోచ్‌లలోని ప్రయాణికులపైనబడి... నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. రెండు బంగారు గొలుసులు, హ్యాండ్ బ్యాగ్‌లు లాక్కున్నారు. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇతర బోగీల్లో ఉన్న ప్రయాణికులూ అప్రమత్తమయ్యారు. మూకుమ్మడిగా దొంగలపైకి తిరగబడ్డారు. ఈ పరిణామం ఊహించని దొంగలు... రైల్లోంచి దిగి పరుగులు తీశారు.
అయినా వదలకుండా వెంటబడుతున్న ప్రయాణికులపై రాళ్లు రువ్వుతూ పారిపోయారు. మొత్తంగా 20 నిమిషాలపాటు ఈ బీభత్సం కొనసాగింది. దోపిడీ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకు వివరాలు సేకరించారు. అప్పటికే రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుండటంతో బాధితులు తమ గమ్యస్థానాల్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సొత్తు కోల్పోయిన ప్రయాణికులు పాండిచ్చేరి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన మెడలోని పది గ్రాముల బంగారు గొలుసు, రూ.2500 నగదు, రెండు సెల్‌ఫోన్లు దోచుకుపోయినట్లు చండీగఢ్ నుంచి మధురైకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న రమ్య అనే మహిళ ఫిర్యాదు చేశారు. అలాగే... తన దగ్గరి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు దోచుకున్నట్లు మరో మహిళ పేర్కొన్నారు. తన బ్యాగ్ పోయినట్లు ఇంకొకరు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల్లో ‘దొంగలు’
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఇలాంటి దోపిడీకి పాల్పడతాయని పోలీసులు తెలిపారు. దోపిడీ చేయాలనుకున్న రైళ్లను, ప్రాంతాన్ని ముందే ఎంచుకుని, తమ వాహనాలను అక్కడే పెట్టుకుంటారు. కొందరు ప్రయాణికుల రూపంలో రైలు ఎక్కుతారు. మరికొందరు ‘స్పాట్’లో ఉండి సిగ్నల్ ట్యాంపరింగ్‌కు పాల్పడతారు. రైలు ఆగగానే అందినకాడికి దోచుకుని వాహనాల్లో పారిపోతారు. అల్లూరు రోడ్డు స్టేషన్ వద్ద రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన ఒక బాక్స్‌లోని సీసీ కెమెరాల్లో ఇద్దరు దొంగల కదలికలు రికార్డయినట్లు తెలుస్తోంది. దొంగల ముఠా పక్కాప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. రైల్వేశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయన్నారు. కాగా.. అల్లూరు రోడ్డు వద్ద గతంలోనూ రెండుసార్లు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లలో దోపిడీ యత్నానికి దుండగులు పాల్పడ్డారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..