Ugadi: ఎవరి ‘పంచాంగం వారిదే
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:53 AM
ఉగాది సందర్భంగా పంచాంగ పఠనం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ముగ్గురు సిద్ధాంతులు మూడు విధాలుగా జ్యోతిష్య ఫలితాలు చెప్పారు. వైసీపీకి అధికారం రాబోతుందని నారాయణ మూర్తి, టీడీపీకి మంచి రోజులు రానున్నాయని మాచిరాజు వేణుగోపాల్ పేర్కొన్నారు.

తీరు మార్చుకోని సిద్ధాంతులు
ఎన్నికలకు నాలుగేళ్లున్నా
జగన్‌దే అధికారమన్న ఓ సిద్ధాంతి
పార్టీలో అందరికీ బాబు పదవులు
ఇచ్చేస్తారన్న టీడీపీ పంచాంగకర్త
అమరావతి పూర్తవుతుందని వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ. ఉగాదితో ప్రారంభమయ్యే నూతన సంవత్సరం ఎలా ఉంటుందన్న ఆసక్తితో దాదాపు ప్రతివారూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా ఉగాది వేడుకలు నిర్వహించి.. పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే.. అసలు పంచాంగంలో ఎలా ఉన్నా.. ‘ఏ ఎండకు ఆ గొడుగు’ అన్నట్టుగా పంచాంగ కర్తలు.. ఆయా పార్టీల కార్యక్రమాల్లో ఆయా నేతలకు అనుకూలంగా పంచాంగాన్ని వండివారుస్తున్నారు. దశాబ్దం కిందటి వరకు ఎలా ఉన్నా.. గత పదేళ్ల నుంచి మాత్రం పార్టీలు, నాయకుల మెప్పుకోసం పంచాంగ కర్తలు.. ‘ఎవరి పంచాంగం వారిదే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్రంలో ఇదే కనిపించింది. విశ్వావసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ, వైసీపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు పంచాంగ కర్తలు మూడు విధాలుగా పంచాంగ పఠనం చేసి.. నాయకులను మెప్పించే ప్రయత్నం చేయడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని, ఆ పార్టీ అధినేత జగన్ జాతకం ఈ ఏడాది దేదీప్యమానంగా వెలిగిపోతుందని సిద్ధాంతి నారాయణమూర్తి చెప్పడం గమనార్హం.
కానీ, వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మరో నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటికి కూడా నేతల నాడిని బట్టి ఎవరికి అధికారం దక్కుతుందన్నది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ, సిద్ధాంతి నారాయణమూర్తి మాత్రం వైసీపీ నాయకుల మనసుకు ఇష్టమైన మాటలు చెప్పి మెప్పించే ప్రయత్నం చేశారన్న విమర్శలు వినిపించాయి. ఇక, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది కార్యక్రమంలో సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ పఠనం చేశారు. ఈయన కూడా టీడీపీని పొగడ్తలతో ముంచెత్తారు. టీడీపీ అంటే తులా రాశి అని, ఈ ఏడాది తులారాశికి చాలా బాగుందని అన్నారు. తెలంగాణలో కూడా టీడీపీ నిలదొక్కుకుంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. పార్టీలో ఎంతమంది నాయకులు ఉంటే అందరికీ పదవులు దక్కుతాయని చెప్పడం కొసమెరుపు. మరి ఇది సాధ్యమేనా? అన్నది చూడాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. మాటకోసారి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే.. నాగఫణి శర్మ చెప్పిన విషయాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గతంలో ఇరుకు దారులను మార్చి ఇంద్రభవనాలను నిర్మించిన(హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మహానగర నిర్మాణం(అమరావతి) పూర్తి చేస్తారన్నారు. ఆయన లక్ష్యాన్ని ఎవరూ చేరుకోలేరని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News