Animal Welfare: మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:22 AM
వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని పశువులకు తాగునీరు అందించేందుకు రాష్ట్రంలో గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం ఊపందుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 67.50 కోట్ల వ్యయంతో 15 వేల నీటి తొట్టెలను నిర్మిస్తున్నారు.
ప్రతి గ్రామంలో ఉపాధి నిధులతో నిర్మాణం
మొత్తం 15 వేలు నిర్మించాలని నిర్ణయం
ఇప్పటికే 12 వేలకుపైగా సిద్ధం.. నెలాఖరులోగా మిగిలినవన్నీ పూర్తి
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పల్లె ప్రాంతాల్లో మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. వేసవిలో పశువులు తాగునీటికి ఇబ్బందులు పడకూడదన్న యోచనతో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రతి గ్రామంలో పశువులకు నీళ్ల తొట్టెలు నిర్మించాలని ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తొట్టెల నిర్మాణంలో నిమగ్నమైంది. ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలు నీటి తొట్టెలు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 3 వేల లీటర్ల సామర్థ్యం ఉండే ఒక్కో తొట్టె రూ. 45 వేల ఖర్చుతో నిర్మించతలపెట్టారు. దీనికోసం ఉపాధి హామీ నిధులు మొత్తం రూ. 67.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా ఈ తొట్టెల్లో 4.5 కోట్ల లీటర్లను నిల్వ చేస్తారు. పశువులకు ఇబ్బంది లేకుండా నీరందడం వల్ల పాల ఉత్పత్తి పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రోజుకు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 12 వేల నీటి తొట్టెల నిర్మాణం పూర్తయిందని, మిగిలినవి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు.