‘లులు’ చేతికి మంజీరా మాల్
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:03 AM
దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న హైదరాబాద్, కూకట్‌పల్లిలోని మంజీరా మాల్ భవనం.. అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పరమైంది....
దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రూ.318 కోట్లకు కొనుగోలు
హైదరాబాద్: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న హైదరాబాద్, కూకట్‌పల్లిలోని మంజీరా మాల్ భవనం.. అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పరమైంది. మంజీరా మాల్ రుణదాతలకు రూ.318.42 కోట్లు చెల్లించేందుకు లులు ఇంటర్నేషనల్ చేసిన ప్రతిపాదనకు రుణదాతల కమిటీ (సీఓసీ), ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్ బెంచ్ ఆమోదం తెలపడంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఇదే భవనంలో లులు మాల్ అద్దె పద్దతిలో తన భారీ రిటైల్ మాల్ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఈ భారీ మాల్ భవనానికి యజమాని కాబోతోంది.
2023లో దివాలా పిటిషన్ దాఖలు: మంజీరా మాల్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త జీ యోగానంద్ మంజీరా రిటైల్ హోల్డింగ్స్ పేరుతో ప్రమోట్ చేశారు. అయితే తమకు చెల్లించాల్సిన రూ.317.30 కోట్ల బకాయిలను చెల్లించలేక పోవడంతో రుణదాతలైన క్యాటలిస్ట్ ట్రస్టీషిప్ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2023 జూలైలో మంజీరా రిటైల్ హోల్డింగ్స్‌పై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. మొత్తం 49 సంస్థలు ఈ మాల్‌పై ఆసక్తి చూపించినప్పటికీ చివరికి ఏడు సంస్థలు మాత్రమే పోటీలో నిలిచాయి. అందులో అత్యధికంగా కోట్ చేసిన లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ, సీఓసీ ఆమోదం తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి