Maruti Ciaz: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఈ మోడల్ కారు ఉత్పత్తి నిలిపివేత
ABN , Publish Date - Apr 01 , 2025 | 10:24 PM
మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. సియాజ్ మోడల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. సియాజ్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్న విషయాన్ని ధ్రువీకరించింది. 2014లో తొలిసారిగా కంపెనీ ఈ మిడ్ సైజ్ సిడాన్ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మార్కెట్ అవసరాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘‘మార్కెట్ అవసరాలు, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మేము మార్కెట్ పోర్టు ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ ఉంటాము. ఇక సియాజ్ విషయంలో ఇదే చేశాము. ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. మార్కెట్ అవసరాలను బట్టి భవిష్యత్తులో మరోసారి సియాజ్‌పై దృష్టి సారిస్తాము’’ అని మారుతీ మార్కెటింగ్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీర్ పేర్కొన్నారు.
Also Read: భారీగా పడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో 15869 సియాజ్ కార్లు అమ్ముడుపోగా ఆ మరుసటి ఏడాదికి అమ్మకాలు 13610కు పడిపోయాయి. గతేడాది మరింత తక్కువగా కేవలం 10337 సియాజ్ కార్లను మాత్రమే మారుతీ విక్రయించగలిగింది. సియాజ్ ఎక్స్ షో రూం ధర రూ.9.41 లక్షల నుంచి 12.4 లక్షలుగా ఉంది. సియాజ్‌కు కే15 స్మార్ట్ హైబ్రీడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజెన్ మోడల్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిష్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
కస్టమర్ల మెప్పు పొందడంలో సియాజ్ వెనకబడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, ష్కోడా స్లేవియా, హ్యుండయ్ వెర్నా వంటి కార్లల్లో ఆధునిక టెక్నాలజీ, కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటే సియాజ్‌లో మాత్రం ఎటువంటి అప్‌డేట్స్ లేక వెలవెలబోతోంది.
Also Read: అద్దె చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై రూ.6 లక్షల వరకు నో ట్యాక్స్..
మరోవైపు, భారతీయ కస్టమర్లు ఎస్‌యూవీ వైపు మళ్లుతుండటంతో సిడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతోంది. ప్యాసెంజర్ వాహనాల మార్కెట్‌లో సిడాన్ కార్ల వాటా 10 శాతం అయితే ఎస్‌యూవీ సెగ్మెంట్ వాటా మాత్రం ఏకంగా 55 శాతంగా ఉంది. ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1760767 వాహనాలను విక్రయించినట్టు మారుతీ తాజాగా వెల్లడించింది. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే విక్రయాల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం.
Read More Business News and Latest Telugu News