ఫార్మా కింగ్ దివీస్ మురళి
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:28 AM
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కొందరు నీరుగారి పోతారు. మరికొందరు వాటినే తమ అభివృద్ధికి సోపానాలుగా మార్చుకుంటారు. దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకులు, ఎండీ దివి మురళీ కృష్ణ ప్రసాద్ రెండో కోవకు చెందిన వ్యక్తి....

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు..
తెలుగు నేలపై అత్యంత సంపన్నుడు
రూ.82,000 కోట్ల నికర ఆస్తులు
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కొందరు నీరుగారి పోతారు. మరికొందరు వాటినే తమ అభివృద్ధికి సోపానాలుగా మార్చుకుంటారు. దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకులు, ఎండీ దివి మురళీ కృష్ణ ప్రసాద్ రెండో కోవకు చెందిన వ్యక్తి. దాదాపు రూ.82,000 కోట్ల నికర ఆస్తులతో భారత ఫార్మా రంగంలో దూసుకుపోతున్న ఈ ‘ఫార్మా కింగ్’ గురించి మరిన్ని వివరాలు.
డాక్టర్ దివి మురళీ కృష్ణ ప్రసాద్. భారత ఫార్మా పరిశ్రమలో ముఖ్యంగా హైదరాబాద్ ఫార్మా రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పట్టుదల, నిజాయితీతో పారిశ్రామిక రంగంలో శిఖరాగ్ర స్థానానికి ఎదిగిన కొద్దిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో దివి మురళీ కృష్ణ ప్రసాద్ ఒకరు. కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో 1951 మార్చి 17న ఒక పెద్ద కుటుంబంలో 13వ సంతానంగా ఆయన జన్మించారు. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం గత ఏడాది దేశంలోని టాప్-100 మంది సంపన్నులో దివి మురళీ 29వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం దాదాపు రూ.82,000 కోట్ల ఆస్తులతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన దివి మురళీ కృష్ణ ప్రసాద్ ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి.
జీవిత ప్రస్థానం: దివి మురళీ చదువుల్లో ముందు నుంచి పెద్ద టాపరేమీ కాదు. టెన్త్ ఎలాగోలా గట్టెక్కినా, మచిలీపట్నంలో ఇంటర్ సెకండియర్ ఫెయిలయ్యారు. తర్వాత కష్టపడి ఇంటర్ పూర్తి చేసి కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌లో బీ ఫార్మసీలో చేరారు. అక్కడా ఆయన చదువు పెద్దగా పుంజుకోలేదు. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసేందుకూ బాగా కష్టపడాల్సి వచ్చింది. చివరికి ఆ కోర్సు పూర్తయ్యే సరికి యూనివర్సిటీలోనే టాపర్‌గా గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత అదే యూనివర్సిటీలో ఎం ఫార్మసీనీ గోల్డ్ మెడల్‌తో పూర్తి చేశారు. ఎం ఫార్మసీ పూర్తి చేశాక 1975లో హైదరాబాద్ వచ్చి వార్నర్ హిందుస్థాన్ అనే కంపెనీలో రూ.250 నెల జీతంతో ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించారు. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఫార్మాస్యూటికల్ సైన్సె్‌సలో పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.
అమెరికా పయనం: వార్నర్ హిందుస్థాన్ కంపెనీలో కొద్ది కాలం పని చేసేసరికే దివి మురళీ కృష్ణ ప్రసాద్‌కు బోరు కొట్టింది. ఇక్కడ లాభం లేదు. అమెరికా వెళ్లి మన లక్ పరీక్షించుకుందాం అనుకున్నారు. వెంటనే అమెరికా వీసా కోసం దరఖాస్తు చేశారు. గోల్డ్ మెడలిస్టు కావడంతో అమెరికా వీసా తేలిగ్గానే వచ్చింది. 1977లో రూ.600తో అమెరికాలో అడుగు పెట్టారు. అక్కడ దాదాపు ఏడేళ్ల పాటు అనేక ఫైన్ కెమికల్స్, ఫార్మా, కాస్మొటిక్ కంపెనీల్లో పని చేశారు. అప్పటికే అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది. అయినా ఏదో వెలితి. ఇంత కష్టపడి చదివి మన తెలివి తేటలన్నీ అమెరికా కోసమేనా. దేశం కాని దేశంలో ఎంతకాలం ఇలా బంధుమిత్రులు అందరికీ దూరంగా బతకాలి? అనే ప్రశ్నలు వేధించేవి. చివరకు ధైర్యం చేసి ఇండియా వచ్చేసారు.
ఇండియా వచ్చాక: ఇండియా అయితే వచ్చారు గానీ.. దివి మురళికి ఏమి చేయాలో వెంటనే తోచలేదు. ఏదైనా కంపెనీ పెట్టాలంటే చేతిలో పెద్దగా డబ్బులూ లేవు. అప్పు డే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధినేత డాక్టర్ అంజిరెడ్డితో కలిసి 1984లో కెమినార్ డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీని కొనుగోలు చేసి దాన్ని బహుముఖంగా విస్తరించారు. ఇక్కడా సవాళ్లు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించారు.
దివీస్ ల్యాబ్స్ ఏర్పాటు
అంజిరెడ్డితో కలిసి కెమినార్ డ్రగ్స్ కంపెనీని సక్సెస్ చేశాక.. 1990లో సొంతంగా 100 మంది ఉద్యోగులతో దివీస్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు అవసరమైన టెక్నాలజీ, కన్సల్టెన్సీ సర్వీసులు అందించేది. ఈ అనుభవంతో ఔషధ పరిశ్రమకు కీలక ముడి పదార్ధాలైన యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ) తయారీ కోసం 1994లో నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ సమీపంలో దివీస్ లేబొరేటరీస్ పేరుతో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లోని 8 కంపెనీలు తమకు అవసరమైన ఏపీఐలను దివీస్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఈ కంపెనీకి చౌటుప్పల్‌తో పాటు విశాఖపట్నం సమీపంలోని చిప్పాడ వద్ద, కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద ఏపీఐ ప్లాంట్లు ఉన్నాయి. తుది ఔషధాల ఉత్పత్తికి అవసరమైన కీలక ఏపీఐల ఉత్పత్తిలో దివీస్ ల్యాబ్స్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి కంపెనీ. కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ కూడా గత వారం రూ.1.53 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దాదాపు 40 శాతం గత ఏడాది కాలంలో పెరగడం విశేషం.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News