Pitti Engineering Revenue: తగ్గిన పిట్టీ ఇంజనీరింగ్ లాభం
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:32 AM
పిట్టీ ఇంజనీరింగ్ మార్చి త్రైమాసికంలో నికర లాభం తగ్గగా ఆదాయం పెరిగింది. ఏడాది మొత్తానికి లాభం పెరిగినప్పటికీ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో పిట్టీ ఇంజనీరింగ్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.472.30 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.36.14 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.46 కోట్లు)తో పోల్చితే లాభం 21.43 శాతం తగ్గగా ఆదాయం మాత్రం 28.54 శాతం పెరిగింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.1,743.36 కోట్ల ఆదాయంపై రూ.122.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24తో పోల్చితే ఆదాయం 34.87 శాతం పెరగగా లాభం 36.33 శాతం వృద్ధి చెందింది. మార్చి ముగిసే నాటికి కంపెనీ నికర రుణ భారం రూ.439.04 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1.50 (30 శాతం) డివిడెండ్‌ను సిఫారసు చేసింది.