SEBI market Regulations: ఇక నేరుగా సెబీ మధ్యవర్తిత్వం
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:52 AM
మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, కొన్ని కేసుల్లో నేరుగా మధ్యవర్తిత్వం చేపట్టేందుకు యోచిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను కట్టడి చేయడానికి నిబంధనలు మరింత కఠినం చేస్తూ వివిధ వ్యక్తులను జాబితాలో చేర్చింది.
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన కొన్ని కేసుల్లో ఇక నేరుగా మధ్యవర్తిత్వానికి దిగాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చా పత్రం విడుదల చేసింది. సంబంధిత పార్టీలు వచ్చే నెల 12లోగా ఈ చర్చా పత్రంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. అయితే ఏ కేసుల్లో పడితే ఆ కేసుల్లో గాకుండా కనీసం రూ.10 కోట్లు లేదా అంతకు మించిన వివాదాలు తలెత్తే కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలు, ఒకే అంశంపై పదేపదే తలెత్తే కేసుల్లో మాత్రమే ఈ మధ్యవర్తిత్వం జరపాలని సెబీ యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఓడీఆర్) వ్యవస్థనీ సమూలంగా మార్చేయాలని సెబీ యోచిస్తున్నట్టు సమాచారం.
పక్కాగా ఇన్‌సైడర్ నిబంధనలు: లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ నిషేధం పరిధిలోకి వచ్చే వ్యక్తుల జాబితాను మరింత విస్తరించింది. లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు, బోర్డు సభ్యులు, కీలక ఉద్యోగులు, ఆడిటర్లతో పాటు వారి సమీప బంధువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. కంపెనీలు వీరి వివరాలను ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్ విండో క్లోజ్ చేసేందుకు రెండు మూడు రోజుల ముందే డిపాజిటరీలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ నిషేధాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ జూలై 1 నుంచి టాప్-500 లిస్టెడ్ కంపెనీల షేర్లకు, అక్టోబరు 1 నుంచి మిగతా కంపెనీల షేర్లకు అమలు చేస్తారు.