Share News

Future of Amaravati: అమరావతి 2.0

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:20 AM

భారత ప్రధాని మే 2, 2025 న అమరావతి 2.0 పునరుజ్జీవనానికి ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కేంద్రం మరియు ప్రపంచ బ్యాంకు సహాయం, భూమి మానిటైజేషన్ వంటి పథకాలు అమలులో ఉన్నాయి

 Future of Amaravati: అమరావతి 2.0

మే నెల రెండవ తేదీన భారత ప్రధానమంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునరుజ్జీవనంతో– అమరావతి 2.0 దశ మొదలవుతోంది. సరిగ్గా పదేళ్ళముందు, అమరావతి 1.0ని ప్రారంభించిన ప్రధాని మోదీ, తానే తిరిగి పదేళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వ భూరి సహాయంతో మళ్ళీ అమరావతి 2.0ని మొదలుపెడతానని ఊహించి ఉండరేమో. 2019 మే నెల తర్వాత అయిదేళ్ళు అమరావతి చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా రాజధానిని అంధకారంలోకి తోసెయ్యడానికి శతప్రయత్నాలు చేసింది. అమరావతి మొదటి దశలో చేపట్టిన పనులన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ఆపేసింది. మొదలై, సగంలో ఉన్న, దాదాపు పూర్తయిన భవనాలను కర్కశంగా పాడుబెట్టేసారు. భూములిచ్చిన పుణ్యానికి అమరావతి రైతులను, మహిళలను జుట్టుపట్టి వీధుల్లోకి ఈడ్చారు. పోలీసులు స్త్రీలని కూడా చూడకుండా బూటు కాళ్ళతో పొట్టలో తన్నారు. వందల కేసులు పెట్టారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని ప్రయోగించి జైలుపాలు చేసారు. కానీ రైతులు ధైర్యం వీడలేదు. మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. రాష్ట్రమంతా వారికి బాసటగా నిలబడింది. ఐదేళ్ళ పాటు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి అమరావతి ఉద్యమం కొనసాగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ చేసిన అన్యాయాలకు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతూ చిత్తుగా ఓడించారు. నిజం గెలిచింది. నేడు అమరావతి బావుటా మళ్ళీ రెపరెపలాడుతున్నది.


ఇన్ని కష్టాల తర్వాత అమరావతి పునరుజ్జీవనం ఎలా సాధ్యమైంది? నిశ్చయంగా కేంద్రం భూరి సహాయం చేసింది, సందేహమే లేదు. కేంద్రం ఇస్తున్న రూ.15వేల కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవెలప్మెంట్ బ్యాంక్ అప్పుగా ఇస్తున్న 800 మిలియన్ల అమెరికా డాలర్లు, హడ్కో సంస్థ ఇచ్చిన రూ.11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యుతో చర్చల్లో ఉన్న రూ.5వేల కోట్లు... ఇవీ ప్రస్తుతానికి రాబోతున్న నిధులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వంత బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి కేటాయించలేదు. మొత్తం సీఆర్డీయే అప్పుగా తీసుకొని, రాబోయే వివిధ సంస్థలు, భూమి మానిటైజేషన్‌ తదితర ఆదాయాలతో మాత్రమే ఆ అప్పు చెల్లించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. అమరావతిలో మొదటి ఫేజ్‌లో 7,420 చదరపు కిలోమీటర్లు. ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా 217 చ.కి.మీ మాత్రమేగాక, కృష్ణ జిల్లాలోని విజయవాడ పట్టణం, చుటుపక్కల ప్రదేశాలు, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి లాంటి మరికొన్ని పట్టణాలు కూడా ఉంటాయి. దేశంలోని మిగతా రాజధానులు వేగంగా ఎదుగుతున్నట్టే అమరావతి పెరిగి గుంటూరును తాకే రోజు దగ్గరలోనే ఉంది. 217చ.కి.మీ కోర్ క్యాపిటల్ ప్రదేశంలో కలిసి ఉండే 16.9చ.కి.మీ ప్రధాన రాజధాని ప్రదేశంలోనే సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలు, హైకోర్టు భవనాలు మంత్రుల, జడ్జీలు, సివిల్ సర్వీస్ అధికారుల నివాసాలు తదితరాలు ఉంటాయి. కృష్ణా తీరాన ప్రఖ్యాత ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ డిజైన్ చేసిన అమరావతి 25–30 ఏళ్లలో దశల వారీగా, 2050 నాటికి ఒక ఆర్థిక కేంద్రంగా మారి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులతో, పరిశ్రమలతో, వ్యాపారస్థులతో, వృత్తి నిపుణులతో, 15 లక్షల ఉద్యోగాలతో, 35 లక్షల జనాభాతో 35 బిలియన్ల డాలర్ల స్థూల ఉత్పత్తితో ఉంటుందని అంచనా. ఉదాహరణకు విజ్ఞాన సిటీ అనబడే ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 22,000 విద్యార్థులతో ఎస్ఆర్ఎం, వీఐటీ, అమృత విశ్వవిద్యాలయాలు, ఎన్ఐడీ విజయవంతంగా నడుస్తున్నాయి.


బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ, నిర్మాణాలు ప్రారంభించగా; పర్ద్యు, టోకియో, జార్జియా యూనివర్సిటీ లాంటివి చర్చల్లో ఉన్నాయి. ఎయిమ్స్ ఆసుపత్రి ఇప్పటికే మంగళగిరిలో పూర్తి స్థాయిలో నిర్వహణలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాత పట్టణాలైన అమ్‌స్టర్‌డాం, టోక్యో, సింగపూర్‌లను ప్రేరణగా తీసుకొని రాజధానిని తొమ్మిది భాగాలుగా విభజించి విజ్ఞానం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, టూరిజం, న్యాయ, క్రీడా, ఆర్థిక, ప్రభుత్వ మండలాలుగా నిర్వచించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత పరిశ్రమలు, వ్యాపారాలు ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.మొదటి అమరావతి మాస్టర్ ప్లాన్ చేసిన సింగపూర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ వ్యాపార సమాలోచనలు మొదలుపెట్టారు. అమరావతి కోర్ రాజధాని మొదటి దశ అభివృద్ధికి బడ్జెట్ సుమారు రూ.65 వేల కోట్లను, 73 పనులుగా విభజించి టెండర్లు పిలిచేసారు. చాలా వాటికి బిడ్డర్లను ఖరారు చేసారు. వివిధ ఆర్థిక సంస్థల నుండి మొదటి దశ నిధులు దాదాపు వచ్చేసాయి. ఈ పనులకే ప్రధాన మంత్రి మే 2న ప్రారంభం చేయనున్నారు. నేడు అమరావతి రోడ్లు భారీ యంత్రాలు, ట్రక్కులు, పైల్ డ్రైవర్లు, ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లు, క్రేన్‌లు, కాంక్రీట్ మిక్సర్లతో క్షేత్ర స్థాయి సన్నాహాలతో నిర్మాణ జాతరలా సందడిగా ఉన్నది. కూటమి ప్రభుత్వం అమరావతి విస్తీర్ణానికి సంబంధించి కొన్ని అదనపు మార్పులు కూడా చేస్తున్నది. అమరావతిలో భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి అనే ఉద్దేశ్యంతో దానికి కూడా స్థల సేకరణ జరపాలని తలపెట్టారు. వాటితో పాటు వ్యాపారాల కోసం స్మార్ట్ సిటీ; హైదరాబాద్‌కు, విశాఖపట్నానికి, మచిలీపట్నం పోర్టుకి రహదారులకు సులభ ప్రవేశం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు లాంటివి కూడా తలపెట్టారు. కానీ వీటికి మళ్ళీ ఒక 35–40 వేల ఎకరాలు అవసరం అవుతాయి.


ఈ స్థలసేకరణ, రైతుల వద్ద నుంచి భూమిని పూలింగ్ పద్ధతిలో చేయాలా, లేక భూసేకరణ పద్ధతిలో చేయాలా అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ అమరావతి పునరుజ్జీవన తరుణంలో వైసీపీతో పాటుగా కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలూ వద్దు అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి. అవి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుంది. భూములిచ్చిన రైతు సోదరులకు మూడేళ్లలో రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తాం అని ప్రభుత్వం సాధికారికంగా హామీ ఇస్తోంది. కానీ అమరావతిని 2019 నుంచి నాశనం చేసిన వారు మాత్రం ఇంకా ఆశలు చావక, ఇటీవల మళ్ళీ ప్రపంచ బ్యాంక్‌కు లెటర్లు, మెయిళ్లు పంపండం లాంటివి మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దుశ్చర్యలను గమనించి ఊరుకోకూడదు. అమరావతి మీద విషాన్ని పోసే కార్యక్రమాలని అడ్డుకోవాలి. ప్రజలు జాగరూకులై ఉండి అమరావతిని ఈ ముష్కరుల దుశ్చర్యల నుండి కాపాడుకోవాలి.

నీలాయపాలెం విజయ్‌కుమార్ చైర్మన్,

ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డ్

Updated Date - Apr 23 , 2025 | 05:21 AM