Share News

Ravulapati Sitaram Rao: డీలిమిటేషన్‌ సమన్యాయం కావాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:48 AM

దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిపోతున్నది. అందువల్ల సమన్యాయాన్ని నిర్ధారించేందుకు సమగ్ర, పరిగణనాత్మకమైన డీలిమిటేషన్‌ విధానం అవసరం.

Ravulapati Sitaram Rao: డీలిమిటేషన్‌ సమన్యాయం కావాలి

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82, 170 ప్రకారం పార్లమెంట్‌లోని సభ్యుల సంఖ్య జనాభాను అనుసరించి ఉండాలి! జనాభా ముఖ్య ప్రాతిపదిక అయినప్పుడు రాష్ట్రాలలోని ఎంపీ సీట్ల విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇదే ఇప్పుడు డీలిమిటేషన్‌ విషయంలో పెద్ద సమస్యగా మారింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాల నిర్ణయానుసారం కుటుంబ నియంత్రణ అమలు చేయడంల్ల లోక్‌సభ, శాసనసభల్లో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతూ వచ్చాయి. మంచి చేసినందుకుగాను మాకు నష్టం వాటిల్లే రీతిలో డీలిమిటేషన్‌ నిర్ణయాలు జరిగాయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వాపోతున్నారు. దేశ నిర్ణయాలలో తమ పాత్ర, జోక్యం క్రమేపీ తగ్గిపోతున్నాయని, ఈ ప్రాతిపదిక మూలాలను వారు ప్రశ్నిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం మొదటి సార్వత్రక ఎన్నికలలో (1951–52) 489 (లోక్‌సభ) సీట్లు ఉన్నాయి. 1951 నుంచి 2004లో జరిగిన పెంపునకు (డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయానుసారం) ప్రత్యేక ఫార్ములాగా ఐడియల్‌ జనాభా సంఖ్య అంటూ అనుసరించినట్లు లేదు. జనాభా ప్రాతిపదికన నిర్ణయాలు చేసినప్పుడు రాజకీయ సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే విధంగా డీలిమిటేషన్‌ను సంస్థీకరిస్తే శాశ్వతంగా దక్షిణాది ప్రాంతాల వారికి గణనీయమైన నాయకత్వం, రాజకీయ పలుకుబడి–ప్రాముఖ్యత కేంద్రంలో ఉండకపోవచ్చనే వాదనను కూడా సహేతుకంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


రాధాకృష్ణన్‌, నీలం సంజీవరెడ్డి, వి.వి. గిరి, కె.ఆర్‌. నారాయణన్‌ వంటి వారు రాష్ట్రపతులుగా, పీవీ నర్శింహారావు, దేవెగౌడ వంటి వారు ప్రధాన మంత్రులుగా అయ్యారు. డీలిమిటేషన్‌– జనాభా ప్రాతిపదిక మీదనే కొనసాగితే ఇక అలాంటి అవకాశం ఉండకపోవచ్చు! నిజమైన గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ (జీడీపీ) ఏ విధంగానైతే ద్రవ్యోల్బణం ఆధారంగా (ఇన్‌ఫ్లేషన్‌) నిర్ణయించి, అన్ని రాష్ట్రాలకు లాభం కలిగిస్తారో; అదే విధమైన రీతిలో ఎక్కువ జనాభా ఉన్నా, అన్ని రాష్ట్రాలకు సంఖ్యాపరంగా లోక్‌సభ, విధానసభలలో న్యాయం చేసే అంశంపై కూడా కేంద్రం లోతుగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. 1977లో లోక్‌సభ సీట్లు 10.10 లక్షల సరాసరి జనాభాను పరిగణనలోకి తీసుకొని 543 సీట్లు ఏ విధంగా నిర్ణయించారో, ఇప్పుడు కూడా ఆ సూత్రాన్నే అనుసరిస్తే 680 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా! టోటల్‌ ఫర్టిలిటీ రేట్‌ – రాష్ట్రాల పరంగా కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఈ సూత్రాన్ని అనుసరించి కొంతవరకు అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేయొచ్చు! ఇంకా ఇంతకంటే మంచి ఫార్ములాలు ఉంటే నిర్ణయాలు– అందరికీ సంతృప్తి కలిగించే విధంగా తీసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే– ఎవర్నీ చిన్నచూపు చూడటం లేదన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది! ప్రజా విశ్వాసమే– ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ!

– రావులపాటి సీతారాంరావు

Updated Date - Apr 23 , 2025 | 02:49 AM